Health Tips | మండే ఎండలు కుదురుగా ఉండనీయడం లేదా.. అయితే ఈ పానీయాలు తప్పక తాగండి..!

Health Tips | మండే ఎండలు కుదురుగా ఉండనీయడం లేదా.. అయితే ఈ పానీయాలు తప్పక తాగండి..!

Health Tips : వేస‌వి వ‌చ్చిందంటే జ‌నానికి అవస్థలు తప్పవు. ఇంట్లోనే ఉంటే ఉక్కపోతకు తడిసిపోవాలి. బయటికి వస్తే ఎండలకు మాడిపోవాలి. ఏం చేయాలన్న చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే తల ప్రాణం తోకకు వస్తుంది. ఈ మండే ఎండ‌ల‌కు తోడు వ‌డ గాడ్పులు కూడా ద‌డ పుట్టిస్తుంటాయి. ఎండల తీవ్రతవల్ల శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కు గురవుతుంది. దాంతో వ‌డ‌దెబ్బ బారినప‌డే ప్రమాదం ఉంది. అయితే, ఈ సమస్యలకు సబ్జా గింజలు చక్కని పరిష్కారం చూపుతాయి. ఈ సబ్జా గింజలతో ఎన్నో రకాలుగా పానీయాలు చేసుకుని తాగొచ్చు. వాటిలో కొన్ని తెలుసుకుందాం..

సబ్జా డ్రింక్స్..

1. ఒంట్లో చల్లదనాన్ని పెంచడమేగాక, ఆరోగ్యాన్ని కాపాడే సబ్జా గింజలను వేసవి కాలంలో క్రమం త‌ప్పకుండా తీసుకోవాలి. అయితే, ఈ స‌బ్జా గింజ‌ల‌ను నేరుగా తిన‌లేం. కాబ‌ట్టి ఇతర పానీయాలతో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

2. సాధార‌ణంగా అయితే సజ్జా గింజలను నీళ్లలో ఒక‌ గంటపాటు నానబెట్టి, తర్వాత వాటిని పెరుగు, మజ్జిగ, షర్బత్‌, మిల్క్‌షేక్ లాంటి న‌చ్చిన పానీయంలో క‌లుపుకుని తాగాలి.

3. పెరుగు, మజ్జిగ, షర్బత్‌ లాంటివి న‌చ్చక‌పోతే బాగా నానబెట్టిన సబ్జా గింజలను ఒక‌ గ్లాసు నీళ్లలో వేసి కొద్దిగా చక్కెర, ఉప్పు కలుపుకుని కూడా తాగొచ్చు.

స‌బ్జా షికంజీ షెర్బత్..

అంతేగాక స‌బ్జా గింజ‌ల‌తో స‌బ్జా షికంజీ షెర్బత్ చేసుకుని కూడా తాగుతారు. ఒక పెద్ద గాజు జార్‌లో కొన్ని ఐస్‌ ముక్కలు వేసి, కొద్దిగా చక్కెర, ఉప్పు, నిమ్మరసం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, నానబెట్టిన సబ్జా గింజలు, నీళ్లు పోసి బాగా కలపాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా పెరుగు, కొన్ని నీళ్లు పోసి మళ్లీ కలుపాలి. అంతే చ‌ల్లచల్లని సబ్జా షికంజీ షెర్బత్‌ రెడీ అవుతుంది.