ఆంధ్ర ఎన్నికలపై కేసీఆర్, జగన్ చర్చ?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు గంటపాటు ఏకాంతంగా చర్చించుకోవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది

- గంటపాటు కేసీఆర్, జగన్ సమాలోచనలు
- షర్మిల రాకను ఎలా ఎదుర్కోవాలి?
- తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎలా తిప్పికొట్టాలి..
- వ్యతిరేక ఓటుపైనే సుదీర్ఘ మంతనాలు
- తల్లి విజయమ్మతో అరగంట పాటు భేటీ
విధాత, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సుమారు గంటపాటు ఏకాంతంగా చర్చించుకోవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటుగా పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బీఆరెస్ ఓటమిపాలు కావడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారం దక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణలో సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం మూలంగానే బీఆరెస్ ఓడిపోయిందనే చర్చ ఒకవైపు ఉన్నప్పటికీ.. ప్రధాన కారణం మాత్రం కేసీఆర్ అహంకారపూరిత వైఖరే కారణమని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. అయితే.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొందరికి సంకేతాలు పంపారు. దీంతో అలకలు, ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇవాళ హైదరాబాద్‌లోని నంది నగర్‌లో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి సుదీర్ఘంగా చర్చించడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. తెలంగాణ ఎన్నికలు, ఫలితాలు, అభ్యర్థుల ఓటమి, కాంగ్రెస్ పథకాలు, ప్రజా వ్యతిరేకత, బీజేపీతో లోపాయికారీ అవగాహన, రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రా పర్యటనలపై ఇద్దరూ అభిప్రాయాలను మార్చుకున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం, అసమ్మతిని పట్టించుకోకపోవడం, ఓటర్లలో అంతర్లీనంగా ఉన్న ఆగ్రహాన్ని గుర్తించకపోవడం, అవినీతి ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలం కావడం, కుటుంబ పాలన అంటూ ప్రతిపక్షం చేసిన ప్రచారంతోపాటు.. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటేనన్న చర్చ కూడా బీఆరెస్ ఓటమికి కారణాలుగా పనిచేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారని తెలుస్తున్నది. బీజేపీతో కలవడం మూలానే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయడం లేదనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని కేసీఆర్ ఆవేదనతో అన్నట్లు సమాచారం. సచివాలయానికి రావడం లేదని, ప్రగతి భవన్‌లోకి సాధారణ ప్రజలను అనుమతించడం లేదని కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రచారం ఓటర్లపై ప్రభావం చూపించి ఉంటుందని జగన్‌తో కేసీఆర్ అన్నట్టు బీఆరెస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నది. ఆంధ్రా ఓటర్లు, ముస్లిం ఓటర్లు బీఆరెస్‌ను ఆదరించారని, అందువల్లే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్లీన్ స్వీప్ చేశామని చెప్పారని తెలిసింది. తెలంగాణ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారని, అందువల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని జగన్ మోహన్ రెడ్డికి వివరించారని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముస్లింలు బీఆరెస్‌కే ఓట్లు వేశారని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. ఏపిలో రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలో ఎలా ప్రచారం చేయాలి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుయుక్తులను ఎలా తిప్పికొట్టాలో జగన్‌కు వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కర్ణాటక, తెలంగాణ ఎన్నికల తరువాత ఆంధ్రాలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిందని, ఓటర్లలో మార్పు కన్పిస్తున్నదని కేసీఆర్.. ఏపీ సీఎంను హెచ్చరించారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తాను ఏపీలో సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చతున్నానని కేసీఆర్‌కు జగన్ వివరించినట్టు తెలుస్తున్నది. దాదాపు సగానికిపైగా సిటింగ్‌లకు ఈసారి టికెట్లు ఇవ్వబోవడం లేదని చెప్పారని సమాచారం. ఇదే సమయంలో ఏపీలో వైసీపీ విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరు నాయకులు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్టు చెబుతున్నారు.
తన సొదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించుతున్నందున పోటీ త్రిముఖంగా మారే అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు చెబుతున్నారు. దీనితో ఎవరు నష్టపోతారు? ఎవరు లాభపడతారు అనేది స్పష్టం కావాల్సి ఉన్నదని, ఇప్పుడే ఒక అంచనాకు రావడం కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును షర్మిల ఏ మేరకు చీల్చగలరు? అది తమకు లాభమా, నష్టమా అనేది పరిశీలించాల్సి ఉందని జగన్ చెప్పారని తెలిసింది. వ్యతిరేక ఓటును షర్మిల ఎక్కువ శాతం చీల్చితే సునాయసంగా బయటపడతామని, మరోసారి అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారని సమాచారం. తమకు మద్దతుగా ఉన్న ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లను షర్మిల తనవైపు తిప్పుకొంటే ఫలితాలు మరోలా ఉంటాయని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తే ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్ నుంచి జగన్ సలహాలు స్వీకరించినట్టు తెలుస్తున్నది. సుమారు గంటపాటు జగన్ మోహన్ రెడ్డి.. కేసీఆర్ మంచం పక్కనే కూర్చుని చర్చించుకోవడం చూసిన పలువురు వారి చర్చలు సీరియస్‌గా సాగాయని అంటున్నారు.
విజయమ్మతో అరగంట ఏం చర్చించారు?
తల్లి విజయమ్మతో కొద్ది నెలలుగా దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం లోటస్ పాండ్‌కు వెళ్లి, తన తల్లి విజయమ్మను కలవడం విశేషం. సుమారు అరగంట పాటు తల్లితో కుటుంబ విషయాలతోపాటు రాజకీయాలపైనా చర్చించినట్టు విజయమ్మ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితులు, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుకూలాంశాలను తల్లికి వివరించారని తెలిసింది. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడం వల్ల తనకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈసారి ఏపీలోకి రాకుండా అడ్డుకోవాలని తల్లిని వేడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కుమారుడి మాటలు ఆసాంతం విన్న విజయమ్మ.. షర్మిల విషయంలో చెప్పిన మాటలకు మాత్రం బదులివ్వకుండా మిన్నకుండిఓయారని, దీంతో జగన్ అన్యమనస్కంగా కనిపించారని ఆ వర్గాలు వివరించారు. ఎలాంటి హామీ రాకపోవడంతో జగన్ మౌనంగా తల్లికి నమస్కరించి వెళ్లినట్లు తెలుస్తున్నది.