వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల చేతికి అందించారు. ఆమెను ఏ పీసీసీ చీఫ్ గా ఏఐసీసీ నియమించింది

– ఏ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన
– నిన్ననే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు
విధాత: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల చేతికి అందించారు. ఆమెను ఏ పీసీసీ చీఫ్ గా ఏఐసీసీ నియమించింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కేసీ వేణుగోపాల్ అధికార ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదివరకు ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన రుద్రరాజు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అందజేయగా, పార్టీ అధినాయకత్వం ఆమోదించింది. ఆస్థానంలో వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించారు.

గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. కాగా వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి, ఇటీవల ముగిసిన శాసన సభ ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు. అనూహ్యంగా తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ నుంచి ఆపార్టీ తప్పుకుంది. ఆ క్రమంలోనే అప్పటి నుంచి ఆమె ఏఐసీసీ అధినేతలతో టచ్ లో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పలు దఫాలుగా వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో వైఎస్సీర్టీపీ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈపరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల వైఎస్సీర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అప్పట్లోనే తీవ్ర చర్చకు వచ్చింది.
తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకే.. తాజాగా వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. సోమవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయగా, ముందుగా ఊహించిన విధంగానే పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధినాయకత్వం నియమించింది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడినట్లయ్యింది. ఏపీలో త్వరలో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ కుమారుడు, ప్రస్తుత సీఎం, వైసీపీ అధినేత జగన్.. వైఎస్ కూతురు, ఏ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తలబడనుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారనున్నాయి.