రసకందాయంలో ఆంధ్రా రాజకీయం
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆంధ్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార వైసీపీలో టికెట్ల కుంపటి రాజుకుంటోంది

- వైసీపీలో వరుస రాజీనామాల పర్వం
- రచ్చకెక్కుతున్న టికెట్ల కేటాయింపు
- పలువురు ఎమ్మెల్యేలు, అసంతృప్తులు గుడ్‌బై
- మొన్న ఆళ్ల, నేడు కాపు..
- అదేబాటలో మరికొందరు!
- టీడీపీలోనూ అసమ్మతి గళం
- పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ నాని
- ఎన్నికల ముంగిట పార్టీల్లో సెగలు
- పొత్తుల ముంగిట బీజేపీ, కమ్యూనిస్టులు
- అంతర్లీనంగా కాంగ్రెస్ ప్రభావం?
విధాత : ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆంధ్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార వైసీపీలో టికెట్ల కుంపటి రాజుకుంటోంది. టికెట్ల ఆశలపై నీళ్లు చల్లిన అధిష్ఠానంపై పలువురు సిటింగ్ ఎమ్మెల్యేలు, అసంతృప్త నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నియామకమూ పలుచోట్ల రచ్చకెక్కుతోంది. వరుస పరిణామాలు వైసీపీ అధినేత జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ప్రతిపక్ష టీడీపీలోనూ అసమ్మతి గళం లేస్తోంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సృష్టించిన హంగామాతో అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో తనకు టికెట్ దక్కదన్న అక్కసుతో నాని వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మరో ప్రధాన పార్టీ బీజేపీతో పాటు కమ్యూనిస్టులు పొత్తులపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీతో జనసేన పొత్తు అధికారికంగా ప్రకటించగా, బీజేపీ కూడా ఆవైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి సుదీర్ఘంగా చర్చించడం రాజకీయంగా ఆసక్తి రేపింది. ఎటూ పొత్తులు తేలక కమ్యూనిస్టులు సందిగ్ధంలో ఉన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నెల రోజులుగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగా ఇటీవల మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఆ క్రమంలోనే వరుసగా నియోజకవర్గ నేతలతో వేర్వేరుగా చర్చలు కొనసాగించారు. పార్టీ అంతర్గత సర్వేలో తేలిన విజయావకాశాలపై ఈ సందర్భంగా జగన్ వారితో చర్చించినట్లు సమాచారం. ఈ మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామృష్ణారెడ్డిని పిలిపించి, టికెట్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం సిటింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఇలాంటి సందర్భమే ఎదురైంది.
శుక్రవారం సీఎం జగన్ ను కలిసేందుకు కుటుంబ సమేతంగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారికి, జగన్ కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఆ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారితో చర్చించారు. సర్వేల ఆధారంగా పార్టీ టికెట్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. టికెట్ ఆశలు ఆవిరి కావడంతో కాపు రామచంద్రారెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయం ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కారు. వైసీపీని, జగన్‌ను నమ్మినందుకు గొంతుకోశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆపై తమ కుటుంబం నుంచి రెండు నియోజకవర్గాల్లో స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. రాయదుర్గం సిటింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామాతో వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. తాజాగా ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే అధికార పార్టీని వీడారు. ఇంతకు ముందే ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు
ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని రాయుడు ట్వీట్ చేశారు. ఉన్నపళంగా అంబటి రాయుడు పార్టీని వీడడం రాజకీయంగా దుమారం రేపింది.
నరసరావు పేట ఎంపీ టికెట్ చిచ్చు
వైసీపీలో నరసరావు పేట ఎంపీ టికెట్ చిచ్చురేపుతోంది. పల్నాడు ఎంపీ లావు కృష్ణదేవరాయులుకు టికెట్ ఇచ్చేది లేదని అధిష్ఠానం చెప్పింది. కృష్ణ దేవరాయలు కోసం సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుదీర్ఘ మంతనాలు జరిపారు. చివరకు సీఎం ఆదేశాలను అనుసరించి పార్టీ నేతలు నడుచుకోవాలని ధనుంజయ రెడ్డి ఆదేశించారు. ఈ పరిణామంతో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి నరసరావుపేట నుంచి పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని చెప్పారు. అధిష్ఠానం లెక్కలు వేరు.. తన ఆలోచనలు వేరు అంటూ ఎంపీ లావు కృష్ణదేవరాయులు కామెంట్ చేయడం గమనార్హం.
తిరుగుబాటుకు సిద్ధమైన సిటింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్?
వైసీపీ పార్టీ పలు స్థానాల్లో లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేస్తోంది. సిటింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆయనపై ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మార్ఫింగ్ వీడియో వెలుగులోకి రావడం, ప్రతిపక్షాలు రచ్చకెక్కడంతో వైసీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతల్లోనూ గోరంట్ల మాధవ్‌పై వ్యతిరేకత నేపథ్యంలో రంగంలోకి కొత్త ముఖాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుంతకల్లుకు చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన శాంతను హిందూపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈమె కర్ణాటకలోని బళ్లారికి చెందిన బీజేపీ ప్రముఖ నేత శ్రీరాములుకు స్వయానా చెల్లెలు. శాంత గతంలో బళ్లారి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఈమెను పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించడాన్ని జీర్ణించుకోలేని సిటింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ అధిష్ఠానంపై అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి జంప్ చేయనున్న వైఎస్సార్సీపీ ఎంపీ
వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు, అభ్యర్థుల ఎంపిక నేతల్లో చిచ్చు పెట్టడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ నిర్ణయంపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ బాలశౌరి టీడీపీలోకి జంప్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడైన బాలశౌరికి గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. అంతకుముందు 2004లో దివంగత వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎంపీగా పనిచేశారు. ఆయన వైసీపీని వీడితే పెద్ద ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు.
అరకు వైసీపీ ఇంచార్జిపై ముసలం
అరకు నియోజకవర్గంలోని అధికార వైసీపీలో ముసలం నెలకుంది. అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా గొడ్డేటి మాధవిని నియమించింది. స్థానిక వైసీపీ నేతలు ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరకులో ఎంతోమంది సీనియర్ నాయకులు, ఆశావహులు ఉండగా, పాడేరుకు చెందిన మాధవిని ఇన్‌చార్జ్‌గా ఎలా నియమిస్తారని స్థానిక నాయకులు అధిష్ఠానంపై ఫైర్ అవుతున్నారు. స్థానికులనే ఇన్‌చార్జ్‌గా నియమించి, సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నాన్ లోకల్ మాధవిని మార్చకపోతే ఖచ్చితంగా ఓడిస్తామంటూ నేతలు శపథం చేస్తున్నారు.
టీడీపీలో కేశినేని నాని కలకలం
ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీలోనూ అంసతృప్తులు బయటకు వస్తున్నారు. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని, హెచ్చరికలూ జారీ చేశారు. అయినా మార్పు రాకపోవడంతో టికెట్ నిరాకరిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు నాని ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. టీడీపీకి తన అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామాను ఆమోదించుకుని.. ఆ మరుక్షణం టీడీపీకి రాజీనామా చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తేలని బీజేపీ పొత్తులు
రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన తెలంగాణ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు పొత్తులో భాగంగానే పోటీకి దిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముందుకు రావడంతో బీజేపీ పొత్తులు తేలలేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీతో పొత్తుపై పవన్ ప్రకటన తర్వాత తొలిసారి పురంధేశ్వరితో ఆయన భేటీ అయ్యారు.
జనసేన మా మిత్ర పక్షమే అంటూ ఈ సందర్భంగా పురంధేశ్వరి ప్రకటించారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని, పొత్తులపై అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదేనని పురంధేశ్వరి చెప్పారు. దీంతో బీజేపీ పొత్తుల సందిగ్ధంలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ముంగిట అధికార వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండగా, టీడీపీ-జనసేన పొత్తుతో ఇప్పటికే జనంలోకి వెళుతున్నాయి. కమ్యూనిస్టుల ఎన్నికల ప్రయాణం ఇంకా తేలనేలేదు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ ఎన్నికల ఊపు లేకపోగా.. షర్మిల చేరికతో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ కనిపిస్తున్నది. వైసీపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని ఆ పార్టీ నాయకత్వం ఆశాభావంతో ఉన్నది.