గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు వైసీపీ సిద్ధం
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇప్పటినుంచే అధికార వైసీపీని కుదిపేస్తున్నాయి. శాసన సభ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల కేటాయింపు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

– వైసీపీలో వరుస కుదుపులు
– తెగని టికెట్ల పంచాయితీ..
– రచ్చకెక్కుతున్న అసంతృప్త నేతలు
– టీడీపీ గూటికి క్యూకట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
– అదేబాటలో మరికొందరు నేతలు
– అనర్హత వేటుకు స్పీకర్, మండలి చైర్మన్ కు ఫిర్యాదులు
విధాత: ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇప్పటినుంచే అధికార వైసీపీని కుదిపేస్తున్నాయి. శాసన సభ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల కేటాయింపు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిటింగ్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. నియోజకవర్గాల టికెట్ల ఆశావహుల్లో రగులుతున్న అసంతృప్తి అధిష్టానాన్ని ఇరకాటంలో పడేస్తోంది. ఇప్పటికే పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గీత దాటారు. టీడీపీ కండువా కప్పుకుని.. వైసీపీకి సవాల్ విసురుతున్నారు. ఎన్నికల క్షేత్రంలో తేల్చుకుంటామని వైసీపీకి అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, వంశీకృష్ణ టీడీపీ గూటికి చేరిపోయారు. వీరితో పాటు మరింత మంది వైసీపీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు లీక్ లు వస్తున్నాయి. ఎన్నికల ముందు ఊహించని ఈ పరిణామాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది. ఎలాగైనా టీడీపీలోకి వలసలను అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గీత దాటిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు సిద్ధమైంది. శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శాశ్వత సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరింది.
అసంతృప్తులు… బుజ్జగింపులు
తాజాగా విజయవాడ సెంట్రల్ టికెట్ వివాదమైంది. వెల్లంపల్లికి టికెట్ కేటాయిస్తున్నట్లు అధిష్టానం నిర్ణయించింది. ఇదే స్థానాన్ని ఆశించిన మల్లాది విష్ణు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి మల్లాది విష్ణును బుజ్జగించేపనిలో పడ్డారు. మండలి సభ్యత్వం ఇస్తామని ఆయనను ఒప్పించనున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి టికెట్ పంచాయితీ రచ్చకెక్కింది. గంగాధర నెల్లూరులో ఆయన వ్యతిరేక వర్గం రోడ్డెక్కింది. నారాయణ స్వామికి టికెట్ నిరాకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలను సంప్రదిస్తూ, ఆయనకు టికెట్ కేటాయిస్తే ఓడిస్తామంటూ సంకేతాలిస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు. ‘సీఎం జగన్ గారూ… మీకాళ్లు పట్టుకుని దండం పెడుతున్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగదొక్కేందుకే అగ్రవర్ణాలు కుట్ర పన్నుతున్నారు. వారి మాటలు నమ్మొద్దు’ అంటూ బహిరంగంగా వేడుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చెందిన పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కీలక పార్టీ నేతలకు సీఎంవో నుంచి వరుస పిలుపులు వస్తున్నాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా పిలుపువచ్చింది. ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సమాచారం.
మరోవైపు సీఎంవో రమ్మని పిలిచినా పెనమలూరు ఎమ్మెల్యే స్పందించలేదని తెలుస్తోంది. ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారని ప్రచారం జరుగుతోంది. దీంతో మేల్కొన్న అధిష్టానం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీ అయోధ్య రామిరెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. వారు మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధిని బుజ్జగించే పనిలో పడ్డారు. పోరంకిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్ధసారధితో భేటీ అయ్యారు. కాగా మంగళవారం వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల కాబోతున్నట్లు ఆపార్టీ కీలక నేతలు సంకేతాలిస్తున్నారు. 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్పు చేస్తూ జాబితా సిద్ధమైనట్లు లీకులిస్తున్నారు. ఫైనల్ జాబితా వస్తే వైసీపీలో అసంతృప్తులు మరింత రగిలే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.
మళ్లీ వైసీపీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?
– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
వైసీపీ పాలన మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా? అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా? అంటూ ప్రశ్నించారు. ‘వారిని బెదిరించి గనులు స్వాధీనం చేసుకుంటున్నారు. 30 ఏళ్లుగా క్వార్ట్జ్ కు సరైన ధర లేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో క్వార్ట్జ్ గనులను మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు. వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చారు’అని వైసీపీ నేతలపై కోటంరెడ్డి మండిపడ్డారు.