ఐదేళ్లుగా జైలులోనే..న్యాయం చేయండి..కోడికత్తి కేసు నిందితుడి తల్లి ఆవేదన
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన శ్రీను ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడు

– గుంటూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన
విధాత, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన శ్రీను ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడు. నిందితుడి కుటుంబ సభ్యులు న్యాయపోరాటం చేస్తున్నా బెయిల్ రాలేదు. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీను తల్లి, సోదరుడు నిరసనకు దిగారు. దళిత సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి సావిత్రి మాట్లాడారు. తన కుమారుడు దాదాపు ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని కన్నీటిపర్యంతమైంది. న్యాయం చేయాలని వేడుకుంది. జీవిత చరమాంకంలో అండగా ఉండాల్సిన కుమారుడు జైలులో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయింది. సీఎం జగన్ న్యాయస్థానానికి హాజరుకావడం లేదని, దీంతో కుమారుడికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ న్యాయ పోరాటంలో శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కావాలనే విచారణకు హాజరుకాకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.