కోటంరెడ్డి, ఆనం కీలక భేటీ
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కీలక నేతలైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు

– తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘ చర్చ
– ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసేందుకు వ్యూహం?
విధాత, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కీలక నేతలైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సంతపేటలోని తన నివాసానికి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆనం రామనారాయణరెడ్డి ఆప్యాయంగా పలకరించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురి మధ్య సుమారు 45 నిమిషాల పాటు చర్చలు సాగాయి. ఈసందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం సాధించేలా మరింత క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసేలా వ్యూహరచన చేశారని సమాచారం. సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఇరువురు నేతలూ నిర్ణయించారు. ఈ కీలక భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అదే సందర్భంగా వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకుంది. కాగా ఆనం, కోటంరెడ్డి వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాతి రాజకీయ పరిణామాల్లో సీఎం జగన్ తో వ్యతిరేకించారు. ఈక్రమంలో పార్టీ అధిష్టానం ఈ ఇద్దరి ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సిద్ధమైంది. పార్టీలోనే అసమ్మతి వర్గంగా ఇమడలేక కోటంరెడ్డి, ఆనం వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధిష్టానానికి టచ్ లో ఉంటూ పసుపు కండువా కప్పుకున్నారు. ఈక్రమంలో ఆనం, కోటంరెడ్డి పలు సందర్భాల్లో వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. రాజకీయ ఉద్రిక్తతలకూ ఇరువర్గాలు కాలుదువ్వారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నెల్లూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అనుచర వర్గం టీడీపీ గూటికి చేరింది. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు ఇద్దరూ కీలక నేతలు కావడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వీరి ప్రభావం ఉండనుంది. టీడీపీ రోజు రోజుకూ బలం పుంజుకుంటుండగా, వైసీపీ నిస్తేజంలో ఉంటోంది.