జగన్‌పై 42 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు?

వైనాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోన్న వైసీపీకి అసమ్మతుల రగడ రాజుకుంటూనే ఉంది. గురువారం విడుదల చేసిన మూడో జాబితాతో మరింత చిచ్చు రగిలింది

జగన్‌పై 42 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు?

– వైసీపీలో తారస్థాయికి సీట్ల చిచ్చు

– మూడో జాబితాతో మరింత రగిలిన అసంతృప్తులు

– పార్టీని వీడుతున్న కీలక నేతలు..

– టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వైపు వైసీపీ అసమ్మతి నేతల చూపు

విధాత, అమరావతి: వైనాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోన్న వైసీపీకి అసమ్మతుల రగడ రాజుకుంటూనే ఉంది. గురువారం విడుదల చేసిన మూడో జాబితాతో మరింత చిచ్చు రగిలింది. పలు నియోజకవర్గాల్లో టికెట్లు కోల్పోతున్న ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతూ సీఎం జగన్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదన్న స్పష్టమైన సంకేతాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధిష్ఠానం పలు స్థానాల్లో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి మొదలైంది. కొందరు కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వాళ్లను శాంతింపజేసేందుకు తన దూతల ద్వారా జగన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నది.

పిఠాపురం ఎమ్మెల్యే బలప్రదర్శన

పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. మార్పులు, చేర్పుల్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని సీఎం జగన్ ఆయనకు నిరాకరించారు. ప్రస్తుత ఎంపీ వంగా గీతకు ఈ స్థానాన్ని కేటాయించారు. ఈ వ్యవహారాన్ని దొరబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో బలప్రదర్శన చేపట్టి, తన రాజకీయ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం దొరబాబు బర్త్‌డే వేడుకలు జరగ్గా, ఈ వేదికగా బల నిరూపణ చేస్తూ, రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

తిరువూరు ఎమ్మెల్యే పక్కచూపు

తిరువూరు నుంచి రెండుసార్లు విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో జగన్‌ సూచనల మేరకు రక్షణనిధితో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు జరిపారు. అయినప్పటికీ రక్షణ నిధి వెనక్కు తగ్గినట్లు కనిపించడం లేదు. పార్టీలో కొనసాగేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. తిరువూరు టికెట్ ఇవ్వకుంటే మరోపార్టీ చూసుకుంటానంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం.

చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో సీట్ల మార్పులు, చేర్పులు కొన్ని స్థానాల్లో చిచ్చుపెడుతున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు కూడా టికెట్ లేదంటూ సంకేతాలు పంపారు. దీంతో రగిలిన ఎలిజా.. పార్టీ తనను మోసిం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఉన్నత ఉద్యోగాన్ని వదులుకున్నానని, నిత్యం జనంలో ఉన్నా.. పెత్తందార్ల మాట కోసం తనను పక్కనబెట్టారని అసహనం వ్యక్తం చేశారు. చింతలపూడిలో పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరిగితే.. జగన్ పెత్తందారులకే ప్రాధాన్యం ఇచ్చారని ఘాటుగా స్పందించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు, తనకు విభేదాలున్నాయని, పెత్తందారుల కాళ్లపై పడలేదు కాబట్టి తనను పక్కనబెట్టారని ఎలిజా ఫైర్ అయ్యారు. మరోవైపు వైసీపీలో కుటుంబపరంగా సీట్లు ఇవ్వడం లేదంటూనే.. బీసీలకు ప్రాధాన్యం ముసుగులో ఉత్తరాంధ్రలో విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీకి అవకాశం కల్పించారు.

హైకమాండ్ బుజ్జగించినా మెత్తబడని విష్ణు

విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం వైసీపీలో రగడ కొనసాగుతూనే ఉంది. ఈ స్థానాన్ని మంత్రి వెల్లంపల్లికి కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో రగిలిన మల్లాది విష్ణు.. సీఎం జగన్‌పై గుర్రుగా ఉన్నారు. కొత్త ఇన్‌చార్జ్‌ వెల్లంపల్లికి సహకరించేది లేదని విష్ణు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో విష్ణుని పక్కన పెట్టిన వెల్లంపల్లి.. నియోజకవర్గంలో తన పని మొదలు పెట్టారు. శుక్రవారం నియోజకవర్గంలో అభివృద్ధి, ఇతర కార్యక్రమాలపై చర్చించేందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లతో వెల్లంపల్లి సమావేశమయ్యారు. సమావేశానికి పిలిచినా విష్ణు హాజరుకాలేదు. మేయర్ భాగ్యలక్ష్మి మాత్రం పాలుపంచుకున్నారు. హైకమాండ్ బుజ్జగించినా విష్ణు మెత్తబడలేదని ఈ పరిణామంతో తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు వ్యవహారం మల్లాది విష్ణు వర్సెస్ వెల్లంపల్లిగా మారిందన్న చర్చ జోరందుకుంది.

టీడీపీ గూటికి కొలుసు పార్థసారథి?

పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీ అధిష్ఠానంపై అలక వీడలేదు. ఈ స్థానాన్ని మంత్రి జోగి రమేశ్‌కు జగన్ కేటాయించారు. పార్థసారథిని పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు కోరగా ఆయన తిరస్కరించారు. పలు దఫాలుగా ఎమ్మెల్యేతో వైసీపీ పెద్దలు జరిపిన చర్చలు విఫలమైన క్రమంలో.. పార్థసారథి పార్టీ వీడేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆయన టీడీపీ నేత నారా లోకేశ్ ను కలవనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి భేటీ అవుతారని సమాచారం. వరుస రాజకీయ పరిణామాలపై పెనమలూరు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా తాను పోటీకి సిద్ధమని మీడియా వేదికగా తేల్చి చెప్పారు.

ప్రకాశంలో పొలిటికల్ హీట్

ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమైన నేత. జిల్లాలో ఆయన సూచించిన అభ్యర్థులకు పార్టీ పెద్దలు టికెట్లు కేటాయించడం లేదని బాలినేని అలకపాన్పు ఎక్కారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ కేటాయించాలని బాలినేని పలు సందర్భాల్లో వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే గురువారం వైసీపీ ప్రకటించిన మూడో జాబితాలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఖరారు కాలేదు. దీంతో మరోసారి ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి నెలకొంది. మాగుంట కోసం బాలినేని పట్టుబట్టారు. ఆ మధ్యే సీఎంవోకు వెళ్లి కలిశారు. మాగుంటకు సీటు ఫైనల్ అని ప్రచారం సాగినా… వైసీపీ ఇప్పటికీ ఆయన పేరును ప్రకటించలేదు. మార్కాపురం ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పేరు కూడా కనిపించలేదు.దీంతో బాలినేని మరోసారి అలకబూనినట్లు ప్రచారం సాగుతోంది. బాలినేనితో సంప్రదింపుల కోసం అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంగా శుక్రవారం కొండేపిలో నూతన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జిగా మంత్రి ఆదిమూలపు సురేష్ పరిచయ కార్యక్రమం జరిగింది. వైసీపీ విజయసాయి రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా… బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఇంచార్జి మాదాసి వెంకయ్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రకాశం జిల్లాలో పొలిటకల్ హీట్ తారస్థాయికి చేరగా.. ఇదే సమయంలో బాలినేని హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్‌లో కొందరు తన సహచరులతో కలిసి సూపర్ స్టర్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సమావేశంలో మాట్లాడిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి.. బాలినేనికి పార్టీలో ప్రాధాన్యం తగ్గలేదు.. ఆయన స్థానం ఆయనకు ఉంటుందని కేడర్ ను సంతృప్తి పరిచినా స్పందన రాలేదు. బాలినేని జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడని చెప్పుకొచ్చారు. ప్రకాశంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయిన వేళ వైసీపీ సందిగ్ధాన్ని ఎదుర్కొంటోంది.

ఆలూరు టికెట్ కోసం జయరాం అనుచరుల పట్టు

ఆలూరు టికెట్ ను సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి జయరాంకు వైసీపీ అధిష్ఠానం నిరాకరించింది. ఆయన్ను కర్నూలు ఎంపీగా పోటీకి దింపింది. ఈ క్రమంలో శుక్రవారం జయరాం ఆలూరులో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాంకు ఎంపీ టికెట్ వద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేశారు. జయరాం సమక్షంలోనే అసంతృప్తి వెళ్లగక్కారు. ఆలూరు టికెట్ జయరాంకే ఇవ్వాలని పట్టుబట్టారు. లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని పలువురు వైసీపీ అధిష్ఠానానికి హెచ్చరికలు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడిన జయరాం… సీఎం జగన్‌కు పరోక్ష హెచ్చరిక చేస్తూ.. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పారు. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళనచెందాల్సిన అవసరం లేదని, నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. కర్నూలు ఎంపీ టికెట్ జేబులో పట్టుకుని వచ్చాను.. పోటీ చేయాలా? వద్దా? అంటూ కార్యకర్తలను కోరడం కొసమెరుపు.