షర్మిల వ్యాఖ్యలపై సజ్జల, సుబ్బారెడ్డి మండిపాటు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల సీఎం జగన్ పాలనపై వాడిన భాష, యాస సరికాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు

షర్మిల వ్యాఖ్యలపై సజ్జల, సుబ్బారెడ్డి మండిపాటు

బాబును సీఎం చేయడమే ఆమె లక్ష్యమని ఫైర్‌

విధాత, తాడేపల్లి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల సీఎం జగన్ పాలనపై వాడిన భాష, యాస సరికాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేసిన విమర్శలపై స్పందించారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారని, వైఎస్సార్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసిందని, సీఎం వైఎస్ జగన్ పై పెట్టినవి అక్రమ కేసులనే కాంగ్రెస్ మాజీ నేత గులాంనబీ ఆజాద్‌ గతంలో చెప్పిన విషయం అందరికి తెలుసన్నారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్సే పార్టీయేనని, అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతగా షర్మిల ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. వైఎస్సార్ బిడ్డగా, జగన్ చెల్లెలిగా తాము అభిమానిస్తామన్నారు. రాజకీయ విమర్శలు చేస్తే తిప్పికొడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఎం తెలుసని, తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారో… ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారో ఆమెకైనా తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదని, తెలంగాణలో పోటీ చేస్తానన్న పర్మిల ఎందుకు వెనకడుగు వేశారని, ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసన్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేనని, అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుందన్నారు. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని, టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెసు వచ్చాయని, చంద్రబాబుతో కుమ్మకై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ ఎన్నటికి రాజీపడబోరన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేక పోతున్నారన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి జగన్ రాష్ట్రానికి మేలు చేసే పని చేస్తున్నారని, దీన్ని బీజేపీతో వైసీపీ చేతులు కలిపిందంటూ షర్మిల ఆరోపించడం అసంబద్ధంగా ఉందన్నారు.

ద్రోహం చేసిన పార్టీలో చేరి మా పై విమర్శలా : వైవీ సుబ్బారెడ్డి

రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిన పార్టీలో చేరి షర్మిల మాపై విమర్శలు చేయడం సరైంది కాదని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. షర్మిల రాష్ట్రానికి తొలిసారి వచ్చారని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆమెకేమి తెలుసన్నారు. ఆమె మాతో వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారన్నారు. ఆయన కుమారుడిని 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. వైఎస్సార్ కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మొన్నటివరకు తెలంగాణ బిడ్డగా అక్కడ తిరిగారని, ఆమె అక్కడ ఎందుకు పోటీ చేయలేదు తెలియదన్నారు.పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా?అని ప్రశ్నించారు. ఢిల్లీ కాంగ్రెస్ లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సమీక్షించుకోవాలన్నారు. షర్మిల కాదు ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టింది సోనియాగాంధీయేనన్నారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబును షర్మిల ప్రశ్నించాలన్నారు. మేము ఎప్పుడు కూడా బీజేపీతో కాంప్రమైజ్ కాలేదన్నారు. ఈనెల 27వ తేదీన భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్ పూరిస్తున్నారన్నారు. రెండు లక్షల మంది 34 నియోజకవర్గాల నుండి హాజరవుతున్నారు.