ఏపీలో ఘటన జరిగితే తెలంగాణ వెళ్లి ఫిర్యాదు చేయాలా? : హైకోర్టు
విధాత ,అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) కార్యాలయాన్ని తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఏపీ భూభాగం పరిధిలో ఎందుకు ఏర్పాటు చేయరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రజలకు హెచ్చార్సీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమంది. హెచ్చార్సీ ఛైర్మన్, సభ్యులను నియమించడంతో బాధ్యత తీరిపోదని, కార్యాలయం ఏర్పాటుచేసి, సిబ్బందిని కేటాయించాలని స్పష్టం చేసింది. ఏపీలో ఏదైనా ఘటన జరిగితే తెలంగాణకు వెళ్లి ఫిర్యాదు చేయాలా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. హెచ్చార్సీ ఏర్పాటు ఉద్దేశం […]

విధాత ,అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) కార్యాలయాన్ని తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఏపీ భూభాగం పరిధిలో ఎందుకు ఏర్పాటు చేయరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రజలకు హెచ్చార్సీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమంది. హెచ్చార్సీ ఛైర్మన్, సభ్యులను నియమించడంతో బాధ్యత తీరిపోదని, కార్యాలయం ఏర్పాటుచేసి, సిబ్బందిని కేటాయించాలని స్పష్టం చేసింది. ఏపీలో ఏదైనా ఘటన జరిగితే తెలంగాణకు వెళ్లి ఫిర్యాదు చేయాలా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. హెచ్చార్సీ ఏర్పాటు ఉద్దేశం ప్రజలకు దూరంగా ఉంచడం కాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు పది రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఏపీసీఎల్‌ఏ) సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు.
పీసీబీ భవన్‌లో ఏర్పాటు చేస్తాం: ఎస్‌జీపీ
ప్రభుత్వం తరఫున ఎస్‌జీపీ సుమన్ వాదిస్తూ.. హైదరాబాద్ ఏపీ పీసీబీ భవన్‌లోని ఓ అంతస్తులో ఏపీ హెచ్చార్సీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్కడెందుకు ఏర్పాటు చేస్తున్నారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ స్పందిస్తూ.. లోకాయుక్త, ఏపీఈఆర్‌సీ హైదరాబాద్ నుంచే పని చేస్తున్నాయని చెప్పారు. న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టం తెచ్చిందని, ఆ చట్టంపై హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు.