వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడు మాజీ మావోయిస్టు దారుణహత్య

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు రాము అలియాస్ మెంటల్ రాముడు (57)ను దుండగులు దారుణహత్య చేశారు

వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడు మాజీ మావోయిస్టు దారుణహత్య

– బండరాయితో మోది చంపిన దుండగులు

– కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ లో ఘటన

విధాత: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు రాము అలియాస్ మెంటల్ రాముడు (57)ను దుండగులు దారుణహత్య చేశారు. శనివారం రాత్రి తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్లు రైల్వే జంక్షన్ సమీపంలో నిద్రించగా, దుండగులు బండరాయితో మోది చంపారు. రాము 30 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ లో పనిచేశారు. 1991లో సరెండర్ అయ్యారు. అప్పటినుంచి గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన 10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు.

రోడ్డుపై తిరుగుతూ మతిలేకుండా తిరుగుతుండేవాడు. దీంతో ఆయన్ను అందరూ మెంటల్ రాముడు అని పిలుస్తుండేవారు. మతిస్థిమితం లేకపోయినా ఎవరిపైనా దాడులు చేసిన ఉదంతాలు లేవని స్థానికులు చెబుతున్నారు. మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతన్న రామును కిరాతకంగా చంపడం మిస్టరీగా మారింది. ఘటనపై తుగ్గలి ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చిన్న వయసులోనే మావోయిస్టుల్లో కలిసిపోయి..

రాముడు తండ్రి పెద్ద ఈశ్వరయ్య మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు రాముడు కూడా మావోయిస్టులకు ఆకర్షితుడయ్యాడు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చురుగ్గా పనిచేశాడు. ఈక్రమంలోనే మావోయిస్టుల్లో చేరిపోయాడు. అంచెలంచెలుగా ఎదిగి భవనాసి దళం కమాండర్ స్థాయికి ఎదిగాడు. మావోయిస్టు కార్యకలాపాల్లో భాగంగా ఈయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ బస్సు దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండగా, పోలీసులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. అందులోభాగంగా పలుసందర్భాల్లో రాముడుపై పోలీసులు ఒకింత దురుసుగా ప్రవర్తించడంతో ఆరోగ్యం క్షీణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. రాముడు సోదరి పోతుల సునీత వైసీపీ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.