పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు.. 11 మృతి.. 100 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఒక పటాకుల ఫాక్టరీలో సంభవించిన పేలుళ్లలో 11మంది చనిపోయారు.100 మంది గాయపడ్డారు.

- మధ్యప్రదేశ్‌లోని హర్దా పట్టణంలో ఘటన
హర్దా: మధ్యప్రదేశ్‌లోని హర్దా పట్టణంలోని పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో అందులో పనిచేస్తున్న ఏడుగురు చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. అనేక మంది ఫ్యాక్టరీలో, చుట్టుపక్కల చిక్కకుని ఉంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని హర్దా కలెక్టర్ రిషి గార్గ్ చెప్పారు. హర్దా పట్టణం శివారు ప్రాంతమైన మగర్ధ రోడ్డును అనుకుని ఉన్న బైరాగఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పేలుళ్ల కారణంగా భారీగా మంటలు వ్యాపించాయి. వరుస పేలుళ్ల మధ్య కొందరు ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. సహాయ చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్ల కోసం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. గాయపడినవారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు సమీప ప్రాంతాల నుంచి 14 మంది వైద్యులను హర్దాకు తరలించారు. 20 అంబులెన్సులు ఇప్పటికే చేరుకోగా.. మరో 50 మార్గమధ్యంలో ఉన్నాయి.