కాంగ్రెస్‌లో చేరడానికి 15 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు సిద్ధం
15 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు.

- పార్టీలో చేరడానికి సిద్దంగా సుధీర్‌రెడ్డి!
- పార్లమెంటు ఎన్నికల్లోపు సోయం బాపురావుతోపాటు పలువురు బీజేపీ నేతలు
- 15 ఎంపీ స్థానాల్లో గెలుపే మా టార్గెట్
- నేను ఎంపీగా పోటీ చేయడం లేదు
- పీసీసీ ప్రచార కమిటీ మధుయాష్కీ
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి 15 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి అన్నారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే ఉద్దేశంతో పార్టీ వద్దని చెపుతుందన్నారు. ఎల్బీ నగర్ ఎమ్మల్యే సుధీర్ రెడ్డి పార్టీ జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇదే సమయంలో పార్టీ మారేవారి గురించి యాష్కి విమర్శలు చేయడం విశేషం. వాళ్లకు కావాల్సింది అక్రమాస్తులను కాపాడుకోవడమేనని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌లో చేరేందుకు సోయం బాపురావు తమ పార్టీ నేతలతో చర్చలు జరిపారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు బీజేపీ నుంచి బాపురావుతో పాటు చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చూస్తున్నారన్నారు.
15 సీట్లు టార్గెట్
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ స్థానాలు గెలువాలని టార్గెట్ గా పెట్టుకున్నదని మధుయాష్కీ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఎంఐఎంను అడ్డంపెట్టుకొని సికింద్రాబాద్‌లో గెలిచేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిని మార్చేందుకే అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చాడని, ఓ కేంద్ర మంత్రి స్వయంగా ఈ విషయం చెప్పాడని తెలిపారు.
విస్తరణపై సీఎందే తుది నిర్ణయం
మంత్రివర్గ విస్తరణలో హై కమాండ్ జోక్యం చేసుకోదని మధు యాష్కీ చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అన్నారు. పీసీసీ బీసీలకు ఇస్తరు అనేది వట్టి ఊహాగానాలేనని మధు యాష్కీ అన్నారు. రెడ్డి లీడర్లు పీసీసీ రేసులో ఉన్నరని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని నామినేటెడ్ ఇవ్వాలని అధిష్ఠానం చూస్తున్నదని తెలిపారు. తనను కావాలనే ఎల్బీ నగర్‌లో ఓడగొట్టారని మధుయాష్కీ వాపోయారు. సొంత పార్టీ లీడర్లే వెన్నుపోటు పొడిచారన్నారు.