భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించిన 15 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు, దీనిపై చర్చ జరగాలని పట్టుబట్టినందుకు 15 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది.

భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించిన 15 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు
  • 15 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌
  • పార్లమెంటులో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణ
  • సస్పెండ్‌ అయినవారిలో మాణిక్కం ఠాగూర్‌, కనిమొళి

న్యూఢిల్లీ : నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఒక రాజ్యసభ సభ్యుడు సహా మొత్తం 15 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో కాంగ్రెస్‌ నుంచి 9 మంది, ఇద్దరు సీపీఎం సభ్యులు, ఇద్దరు డీఎంకే, ఒకరు సీపీఐ ఎంపీ ఉన్నారు. మాణిక్కం ఠాగూర్‌, కనిమొళి, పీఆర్‌ నటరాజన్‌, వీకే శ్రీకాంతం, బేణి బహాన్‌, కే సుబ్రమణియన్‌, ఎస్‌ఆర్‌ పార్తిబన్‌, ఎస్‌ వెంకటేశన్‌, మహ్మద్‌ జావేద్‌ తదితరుల లోక్‌సభ సస్పెన్షన్‌కు గురైనవారిలో ఉన్నారు. 


రాజ్యసభ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓ బ్రైన్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ సస్పెన్షన్లన్నీ బుధవారం నాటి పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు వీరిపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీనిపై ఉభయ సభల్లోనూ గురువారం ప్రతిపక్ష ఎంపీలు నిరసనలకు దిగడంతో ఉభయ సభలూ తరచూ వాయిదా పడ్డాయి. తొలుత లోక్‌సభలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే డిసెంబర్‌ 22 వరకు సస్పెండ్‌ చేస్తూ ఒక తీర్మానం ఆమోదించారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో టీఎన్‌ పార్తిబన్‌, హిబి ఈడెన్‌, జోతిమణి, రమ్య హరిదాస్‌, డీన్‌ కురియాకోస్‌ కుర్యాకస్‌ ఉన్నారు. బుధవారం నాటి భద్రతా వైఫల్యంపై చర్చించాలని రాజ్యసభలో పట్టుబట్టిన టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓ బ్రైన్‌ను కూడా సస్పెండ్‌ చేశారు.


తొలుత ఉభయసభలు ప్రారంభమైన అనంతరం హైడ్రామా చోటు చేసుకున్నది. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్‌షా ఉభయ సభల్లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. ఈ అంశంపై చర్చకు పట్టుపట్టినా రాజ్యసభలో చైర్మన్‌, లోక్‌సభలో స్పీకర్‌ నిరాకరించారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం సభాకార్యక్రమాలకు ఉపక్రమించింది. కానీ.. భద్రతా వైఫల్యంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టిన విపక్ష సభ్యులు.. సభాధ్యక్ష స్థానాల వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. లోక్‌సభలోకి చొరబడిన వారికి పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ‘ఆ ఎంపీపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ.. మహువా మొయిత్రా కేసులో ఏం జరిగిందో చూశాం. కనీసం విచారణ కూడా ముగించకుండానే ఆమెను ఎంపీగా సస్పెండ్‌ చేశారు. కానీ.. ఈ ఎంపీని మాత్రం సస్పెండ్‌ చేయలేదు. ఆయన మా పక్కనే కూర్చొని ఉన్నాడు. భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని మేం డిమాండ్‌ చేస్తే.. వారు అందుకు మాత్రం సిద్ధంగా లేరు. మేం నిరసన తెలిపితే 15 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ముందు లోక్‌సభలో ఐదుగురిని, తర్వాత 9 మందిని సస్పెండ్‌ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం?’ అని వ్యాఖ్యానించారు.


భద్రతా వైఫల్యం దురదృష్టకరం: రాజ్‌నాథ్‌సింగ్‌

పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తేలిగ్గా తీసుకున్నారు. ఇదొక దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. పాసులు జారీ చేసే సమయంలో ఎంపీలు జాగరూకతతో ఉండాలని సలహా ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరుకుని.. ‘సిగ్గు సిగ్గు’ అంటూ నినాదాలు చేశారు. అమిత్‌షా ప్రకటన చేయాల్సిందేనని పట్టుపట్టారు.