సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి

సూరత్ : సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని పాల్సనా ఏరియాలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు మొదట ఓ ఇద్దరు కార్మికులు దిగారు. ఆ దుర్వాసనకు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడటం లేదని పైనున్న కార్మికులకు చెప్పడంతో.. వారిద్దరిని రక్షించేందుకు మరో ఇద్దరు కార్మికులు ట్యాంక్‌లోకి దిగారు. నలుగురు కార్మికులు కూడా ఊపిరాడక మృతి చెందారు.
సమాచారం అందుకున్న పాల్సనా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు.