ఐదేండ్లలో 555 సింహాలు మృతి.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి
ఐదేండ్ల కాలంలో 555 సింహాలు మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో సింహాల మృతి పెరిగిపోతుందా..? అని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

న్యూఢిల్లీ : ఐదేండ్ల కాలంలో 555 సింహాలు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. దేశంలో సింహాల మృతి పెరిగిపోతుందా..? అని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే సమాధానం ఇచ్చారు.
గత ఐదేండ్లలో 555 సింహాలు మృతి చెందాయన్నారు. దేశంలో సింహాలకు ప్రధాన ఆవాసం గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్ అని చెప్పారు. గిర్ అడవిలో 2015లో 523 సింహాలు ఉంటే.. 2020 నాటికి ఆ సంఖ్య 674కు చేరిందని తెలిపారు. ఇక 2019లో 113, 2020లో 124, 2021లో 105, 2022లో 110, 2023లో 103 సింహాలు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
2018, సెప్టెంబర్‌లో 27 సింహాలు గిర్‌లో మృతి చెందాయి. ఈ సింహాల మృతికి కనైన్ డిస్టెంపర్ వైరస్ కారణమని అధికారులు పేర్కొన్నారు. మరో 37 సింహాలు క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నాయి. అయితే గిర్‌లో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో దాదాపు 40 సింహాలను.. గిర్ నేషనల్ పార్కుకు 100 కిలోమీటర్ల దూరంలోని బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలించాలని 2023లో వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.
అయితే గిర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు సింహాలను తరలించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ గవర్నమెంట్ ఆ పని చేయలేదు. 2022-23 మధ్య కాలంలో చీతాలను తీసుకొచ్చి కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టింది.