Hyderabad | నగ్న వీడియోలతో బెదిరింపులు.. హాస్టల్లో యువకుడి ఆత్మహత్య

Hyderabad | సైబర్ నేరగాళ్లు నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడటంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన యువకుడు(22) బీటెక్ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోర్సుల శిక్షణ నిమిత్తం నెల రోజుల కిందట అమీర్‌పేట వచ్చాడు. ఎస్ఆర్ నగర్‌లోని ఓ హాస్టల్లో మరో నలుగురితో కలిసి ఓ గదిలో ఉంటున్నాడు.
అయితే ఇటీవల ఓ యువతి ఆ యువకుడికి వీడియోల్ కాల్ చేసి మాట్లాడింది. సైబర్ నేరగాళ్లు ఆ వీడియో కాల్‌ను రికార్డు చేశారు. అనంతరం ఆ వీడియోను నగ్న వీడియోగా మార్ఫింగ్ చేసి యువకుడికి పంపారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంపిస్తామనడంతో ఒకసారి రూ. 10 వేలు పంపాడు. మరింత డబ్బు కావాలని వేధించడంతో పాటు కొంతమంది ఫ్రెండ్స్‌కు ఆ వీడియోలు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురై హాస్టల్ గదిలో ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.