బిల్కిస్‌బానో రేపిస్టుల విడుదలపై గుజరాత్ సర్కారును ఏకేసిన సుప్రీం
బిల్కిస్‌బానో రేపిస్టులను శిక్షాకాలం కంటే ముందే విడుదల చేయడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేసిందని సుప్రీంకోర్టు మండిపడింది.

- వారిని విడుదల చేసే అధికారం మీకెక్కడిది?
- మతిలేని ఆదేశాలు జారీ చేసిన గుజరాత్ సర్కార్
- బిల్కిస్‌బానో రేపిస్టుల విడుదలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- రెండు వారాల్లో జైలుకు పంపాలని చారిత్రాత్మక తీర్పు
- వారు బయట ఉండటం.. చెల్లని ఉత్తర్వులకు చెల్లుబాటు కల్పించడమేనని వ్యాఖ్య
న్యూఢిల్లీ : న్యాయం కోసం బిల్కిస్‌బానో చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో కీలక మలుపు చోటు చేసుకున్నది. బిల్కిస్‌బానో రేప్ కేసులో 11 మందిని గుజరాత్ ప్రభుత్వం ముందుగానే విడుదల చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ముందుగా విడుదల చేయడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్‌బానో దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. దోషులు జైలుకు పోవాల్సిందేనని, 2వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. 2002 గుజరాత్ మత ఘర్షణల సమయంలో బిల్కిస్‌బానోపై లైంగికదాడి చేయడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో శిక్ష పడిన 11 మందిని 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.
విడుదల ఉత్తర్వుల్లో యోగ్యత లేదు
‘విడుదల ఉత్తర్వుల్లో యోగ్యత లేదు. గుజరాత్ ప్రభుత్వం మతి లేకుండా ఈ ఆదేశాలు జారీ చేసింది’ అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిందితులను విడుదల చేసే అధికారం సదరు కేసు విచారణ జరిగిన రాష్ట్రానికే ఉంటుందని, బిల్కిస్ బానో కేసు మహారాష్ట్రలో విచారించారని పేర్కొన్నది. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం తన అధికారాలను వినియోగించి తీరును తప్పపట్టిన సుప్రీం కోర్టు.. ఇది అధికారాల దుర్వినియోగం, అధికారాల అక్రమణ కిందికే వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దోషులు జైలు బయట ఉండేందుకు అనుమతించడం అంటే.. చెల్లని ఉత్తర్వులకు చెల్లుబాటు కల్పించడమే అవుతుందని పేర్కొన్నది.
తప్పుడు పద్ధతుల్లో ఉత్తర్వులు పొందిన దోషులు
అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి 2022 మే నెలలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా విరుచుకుపడటం విశేషం. తమను ముందే విడుదల చేసేలా గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌కు జస్టిస్ రస్తోగి అప్పట్లో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దోషులు తప్పుడు పద్ధతుల్లో తమ విడుదల ఉత్తర్వులు పొందారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. 2022 ఉత్వర్వులపై గుజరాత్ ప్రభుత్వం సమీక్షను కోరాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
1992 రిమిషన్ పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్‌బానో రేప్ కేసులో దోషులను విడుదల చేసింది. అయితే.. 2014లో వచ్చిన చట్టం తీవ్ర నేరాలు చేసినవారిని విడుదల చేయడాన్ని నిషేధించింది. దోషుల్లో ఒకడైన రాధేశ్యాం షా పెట్టుకున్న రిమిషన్ పిటిషన్‌పై పరిశీలన చేయాలని సుప్రీం కోర్టు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికార పార్టీ అయిన బీజేపీ నేతలు ఉన్న ప్యానెల్‌ను సంప్రదించింది. ‘వారంతా సంస్కారవంతులైన బ్రాహ్మణులు. ఇప్పటికే 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. సత్ప్రవర్తన కలిగి ఉన్నారు’ అని పేర్కొంటూ సదరు ప్యానెల్ వారి విడుదలకు ఆమోదం తెలిపింది.
దోషులను ఘన స్వాగతం
ప్రభుత్వ ఆదేశాలతో శిక్షాకాలానికంటే ముందే విడుదలైన దోషులకు ఘన స్వాగతం లభించింది. పూలమాలలు వేసి, మిఠాయిలు పంచి పండుగ చేశారు. వారి విడుదల కార్యక్రమానికి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే హాజరయ్యారు. దోషులతో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. అదికూడా దుమారం రేపింది. అప్పటి నుంచి బిల్కిస్‌బానో వారి విడుదలకు వ్యతిరేకంగా మళ్లీ న్యాయపోరాటం చేశారు.