మైన‌పు బొమ్మ‌తో అల్లు అర్జున్ క్రేజీ స్టిల్‌.. ఇందులో రియ‌ల్ బ‌న్నీని గుర్తుప‌ట్ట‌డం క‌ష్ట‌మే..!

మైన‌పు బొమ్మ‌తో అల్లు అర్జున్ క్రేజీ స్టిల్‌.. ఇందులో రియ‌ల్ బ‌న్నీని గుర్తుప‌ట్ట‌డం క‌ష్ట‌మే..!

పుష్ప సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న అల్లు అర్జున్‌కి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్ర‌ఖ్యాత టుస్పాడ్స్ మ్యూజియం లో బన్నీ మైన‌పు ప్ర‌తిమను గురువారం రాత్రి 8గంట‌ల‌కు అవిష్క‌రించారు. అదే స‌మ‌యంలో అర్జున్ కూతురు అర్హ కూడా విగ్ర‌హం ఉన్న‌ స్టైల్‌లో స్టిల్ ఇస్తూ అక్క‌డి వారు అవాక్క‌య్యేలా చేసింది. ఇక మైన‌పు బొమ్మ‌తో దిగిన ఫొటోల‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన బ‌న్నీ.. “మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మ లాంచ్ లో నేను. ప్రతి నటుడికీ ఇదొక మైలురాయి అంటూ క్యాప్ష‌న్ పెట్టారు. అయితే మైన‌పు బొమ్మ‌తో బ‌న్నీని చూశాక అందులో రియ‌ల్ ఏది, డూప్ ఏది అని క‌పిపెట్ట‌డం కాస్త క‌ష్టంగానే ఉంది. బ‌న్నీ మైన‌పు విగ్ర‌హం అచ్చం రియ‌ల్ ప‌ర్స‌న్ మాదిరిగానే క‌నిపిస్తూ అంద‌రిని ఆక‌ట్టుకుంది.

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు బొమ్మ ఉన్న తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలిచాడు. గతేడాదే అతని బొమ్మను ఆవిష్కరిస్తున్నట్లు మ్యూజియం నిర్వాహ‌కులు వెల్ల‌డించ‌గా, నాలుగు నెలల తర్వాత అతని వ్యాక్స్ స్టాచూ సిద్ధమైంది. దుబాయ్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో నిర్వ‌హించిన తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్ త‌న ఫ్యామిలీతో క‌లిసి పాల్గొన‌డం విశేషం. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో సరిగ్గా మార్చి 28న విడుద‌ల కాగా, అదే రోజు దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంద‌ని, ఈ ప్ర‌యాణంలో త‌న‌తో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అని బ‌న్నీ తెలిపాడు.

ముఖ్యంగా, నాపై అపారమైన ప్రేమాభిమానాలు కురిపిస్తూ, ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచే అభిమానులకు కృతజ్ఞతలు. రాబోయే సంవత్సరాల్లో మీరు మరింత గర్వించేలా కృషి చేస్తాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని అల్లు అర్జున్ అన్నారు. ప్ర‌స్తుతం బ‌న్నీ మైన‌పు విగ్రహం ఫొటోలు,వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోన్నాయి. దుబాయ్ మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ విగ్రహాలు ఉండ‌గా, వారి జాబితాలో తాజాగా బ‌న్నీ చేరారు. దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటైన తొలి తెలుగు న‌టుడు మైన‌పు విగ్ర‌హం బ‌న్నీదే కావ‌డం విశేషం.