షెడ్యూల్ నాటికి ఏపీ రాజకీయాల్లో కీలక మార్కులు మార్పులు?
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చేటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- ఎన్నికల షెడ్యూల్ నాటికి మారనున్న సమీకరణాలు
- ఏపీలోనూ బీజేపీ బీసీ సీఎం నినాదం?
- పవన్ సీఎం కాదంటే కాపులు టీడీపీకి ఓటేస్తారా?
- షర్మిలపై హర్షకుమార్ వ్యాఖ్యల ప్రభావం ఎంత?
(విధాత ప్రత్యేకం)
లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికారాన్ని దక్కించుకోవడానికి వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక ఫలితాల ప్రభావం తమకేమైనా కలిసి వస్తుందా? అని కాంగ్రెస్ చూస్తున్నది.
ఏపీలో 25 లోక్‌సభ సీట్లు ఉండటంతో పాటు రాజ్యసభలోనూ ఆ రాష్ట్రానికి 11 మంది ఎంపీల ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలకు పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుల ఆమోదంలో ఏపీ ఎంపీల మద్దతు కీలకం. తెలంగాణ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. తెలంగాణకంటే ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
కొన్ని చోట్ల త్రిముఖ పోరు!
కొన్నిరోజులుగా ఏపీ రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అధినేత సిట్టింగులలో 40-60 మంది మార్చే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రెండోసారి అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్‌పై జగన్ దృష్టి సారించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం, ఇక్కడ లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత పరిస్థితి యథాతథంగా కొనసాగితే మొత్తం నియోజకవర్గాల్లోని మెజారిటీ సీట్లలో ద్విముఖ పోరే ఉంటుంది. కానీ కొన్నిచోట్ల త్రిముఖ పోరు తప్పేలా లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, తిరుపతి లాంటి నియోజకవర్గాల్లో ఇప్పటికీ నేతల, కార్యకర్తల బలం ఉన్నది. వైఎస్ షర్మిల విశాఖపట్నం లేదా, విజయవాడ నుంచి పోటీ చేస్తే.. అక్కడా కొంత ప్రభావం కనిపించవచ్చని చెబుతున్నారు.
ఏపీలో బీసీ సీఎం నినాదం
టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతోనే టీడీపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పవన్ చెబుతున్నారు. కానీ ఆపార్టీ కార్యకర్తలతో పాటు కాపు సామాజికవర్గ నేతల ఆలోచనలు పవన్ నిర్ణయానికి భిన్నంగా ఉన్నాయి. పవనే సీఎం కావాలని వాళ్లు కోరుకుంటున్నారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారని అంటే చంద్రబాబు అని ఆ మధ్య లోకేశ్ ఓ చానల్‌లో చేసిన వ్యాఖ్యల తర్వాతే అక్కడ జనసేన కార్యకర్తల, కాపు నేతల వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నట్టు సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని, పొత్తుపై అధిష్ఠాన నిర్ణయమే ఫైనల్ అన్నారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామని తెలిపారు. బీజేపీ అధిష్ఠానం కూడా జనసేనతో కలిసి వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నది. అక్కడ ఆ పార్టీ బలం కంటే పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు మోదీ చర్మిష్మాను ఓట్ల రూపంలో మలుచుకుని లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ నాటికి రాజకీయంగా ఏమైనా జరగొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో వలె ఏపీలో కూడా బీసీ సీఎం నినాదాన్ని బీజేపీ ఎత్తుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. బీజేపీ బీసీ గర్జన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు బీజేపీ ఎన్నడూ గెలువని స్థానాలపై ఈసారి దృష్టి పెట్టింది. అయా నియోజకవర్గాల్లో బీజేపీ స్థానిక నాయకత్వంతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ప్రధాని మోదీ చేసిన ఒక్క పర్యటన లక్షద్వీప్ స్వరూపాన్నే మార్చేస్తోంది. అక్కడి ఒక్క లోక్‌సభ సీటును దక్కించుకోవడానికి, అక్కడి ఆదివాసీ ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రధాని పర్యటను ఆ పార్టీ ఎంతగా ప్రచారం చేస్తున్నదో, ప్రధాని పర్యటన మాల్దీవుల్లో రాజేసిన రాజకీయ రగడ చూస్తున్నదే. అలాంటిది 25 స్థానాలున్న ఏపీని ఎందుకు ఈజీగా తీసుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. అక్కడ పవన్‌ను ముందుపెట్టి సాధ్యమైనంత వరకు రాజకీయంగా బలపడటానికి కమలనాథులు కచ్చితంగా ప్రయత్నం చేస్తారనే టాక్ వినిపిస్తున్నది.
ఎస్సీ ఉప కులాల ఓట్లపై గురి
మందకృష్ణ మాదిగ నేతృత్వంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో చేపట్టిన మాదిగ విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం త్వరలోనే కమిటీ వేస్తామని చెప్పారు. బీసీ సీఎం నినాదంతో బీసీ ఓట్లను, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణతో పాటు, ఏపీలో ఉన్న ఎస్సీ ఉప కులాల ఓట్లను బీజేపీ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. ఆ మేరకు తెలంగాణలో తన ఓట్ల శాతాన్ని కూడా పెంచుకున్నది. ఏపీలో రాజకీయంగా మాల సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సామాజికవర్గ నేతలు ఎక్కువమంది మంది కాంగ్రెస్‌తోనే ఉన్నారు. దీంతో మిగిలిన ఉప కులాలను ఆకర్షించడానికి బీజేపీ మందకృష్ణతో ప్రచారం చేయించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
హర్షకుమార్ మాటల ఆంతర్యం?
కోనసీమ జిల్లాలో బలమైన నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్.. షర్మిలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమెకు బాధ్యతలు అప్పగించవద్దని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడించే నాయకులు లేరా? అని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో షర్మిలకు నాయకత్వం అప్పగిస్తే అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. తన కొడుకు వివాహానికి ఆహ్వానించడానికి జగన్ ఇంటికి వెళ్లిన ఆమె చర్చలు జరిపారని, మోడీని నేను చూసుకుంటా.. నువ్వు సోనియాను చూసుకో.. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు అని జగన్ ఆమెకు చెప్పినట్టు ప్రజలు భావిస్తున్నారని హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు. హర్షకుమార్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఏఐసీసీ పెద్దలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. విభజన సమయంలో పార్టీ నిర్ణయంపై తన అభిప్రాయాన్నిచెప్పినా పదేళ్లుగా పార్టీలోనే ఉన్నారు. పార్టీకి పూర్వవైభవం కోసం పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ సమాయత్వం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వరంలో ఢిల్లీలో జరిగిన కోఆర్డినేటర్ల సదస్సులో పాల్గొన్నఏపీ కాంగ్రెస్ మీడియా వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎన్. తులసి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాము వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్తామని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పాలన చూసిన తర్వాత కాంగ్రెసే మేలన్న భావనకు ప్రజలు వచ్చారన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గానే తీసుకుంటున్నది అనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ నాటికే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు, మార్పులు చోటుచేసుకుంటాయన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమౌతున్నది.