ప్రవళిక మృతిలో బిగ్ ట్విస్ట్.. ఆ కారణం వల్లే ఆత్మహత్య..?

ప్రవళిక మృతిలో బిగ్ ట్విస్ట్.. ఆ కారణం వల్లే ఆత్మహత్య..?
  • ప్రియుడు మోసం చేశాడ‌నే ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య‌.. ఆమెకు గ్రూప్స్‌తో సంబంధం లేదు..
  • మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన హైద‌రాబాద్ సెంట్ర‌ల్ జోన్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్ రావు

వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన‌ ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-2 వాయిదా కార‌ణంగానే ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని నిరుద్యోగులు ఆందోళ‌నకు దిగిన విష‌యం విదిత‌మే. అయితే ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య‌కు ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గ్రూప్స్ ప‌రీక్ష‌లు రాయ‌లేద‌ని, ఇటీవ‌లే కోచింగ్‌లో జాయిన్ అయిన‌ట్లు తేల్చారు.

ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను హైద‌రాబాద్ సెంట్ర‌ల్ జోన్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర రావు మీడియాకు వెల్ల‌డించారు. వ‌రంగ‌ల్ జిల్లా బిక్కాజీప‌ల్లికి చెందిన మ‌ర్రి ప్ర‌వ‌ళిక‌(23) ఇటీవ‌లే గ్రూప్స్ కోచింగ్ కోస‌మ‌ని హైద‌రాబాద్‌లోని అశోక్‌న‌గ‌ర్‌కు వ‌చ్చింది. స్థానికంగా ఉన్న బృందావ‌న్ గ‌ర్ల్స్ హాస్ట‌ల్లో 15 రోజుల క్రితం చేరింది. ఇక నిన్న రాత్రి త‌ను ఉంటున్న హాస్ట‌ల్ గ‌దిలో ప్ర‌వ‌ళిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె స్నేహితురాండ్లు శృతి, సంధ్య గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ని డీసీపీ తెలిపారు.

మా పోలీసులు హాస్ట‌ల్ వ‌ద్ద‌కు చేరుకుని మృత‌దేహంతో పాటు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్‌కు ఎలాంటి లాక్, పాస్‌వ‌ర్డ్ లేదు. దీంతో వాట్సాప్ చాటింగ్ ప‌రిశీలించ‌గా, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కోస్గికి చెందిన శివ‌రాం రాథోడ్‌తో ప్ర‌యివేటుగా చాట్ చేసింది. ఈ చాట్‌ను ప‌రిశీలిస్తే ప్రేమ వ్య‌వ‌హారం కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తేలింది. ఆమె బెడ్‌పై ల‌వ్ సింబ‌ల్స్ రాసి ఉన్న పేప‌ర్ కూడా ల‌భ్య‌మైంద‌ని అది కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని డీసీపీ తెలిపారు.

శుక్ర‌వారం ఉద‌యం క‌లుసుకున్న శివ‌రాం, ప్ర‌వ‌ళిక‌

శుక్ర‌వారం ఉద‌యం శివరాం రాథోడ్, ప్ర‌వ‌ళిక క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బాలాజీ ద‌ర్శ‌న్ హాటల్‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు టిఫిన్ చేసిన‌ట్లు సీసీటీవీ ఫుటేజీ ల‌భ్య‌మైంది. ఇక శివరామ్‌కు వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయింద‌ని, ఆమెను పెళ్లి చేసుకుంటున్న‌ట్లు వాట్సాప్ చాటింగ్‌లో తేలింద‌న్నారు. ప్ర‌వ‌ళిక ప్రేమ వ్య‌వ‌హారం ఆమె త‌ల్లిదండ్రుల‌కు కూడా తెలుసు అని డీసీపీ పేర్కొన్నారు. ప్ర‌వ‌ళిక‌ను కూడా పేరెంట్స్ మందలించార‌ని తెలిపారు. ప్ర‌వ‌ళిక సూసైడ్ నోట్‌తో పాటు ఆమె మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామ‌ని, ఆ నివేదిక రాగానే శివ‌రాం రాథోడ్‌పై చర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అత‌ని ఆచూకీ త‌మ‌కు ల‌భించ‌లేద‌న్నారు.

ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య‌ను గ్రూప్స్‌తో ముడిపెట్టొద్దు..

ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య‌ను గ్రూప్స్ ఎగ్జామ్స్‌తో ముడిపెట్టొద్ద‌ని డీసీపీ కోరారు. ఆమె గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న మాట వాస్త‌వ‌మే కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గ్రూప్స్ ప‌రీక్ష‌లు రాయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆమె ఫ్రెండ్స్ సంధ్య‌, శృతి కూడా స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. నిన్న రాత్రి నిరుద్యోగుల‌ ఆందోళ‌న‌ల స‌మ‌యంలో ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య‌కు, గ్రూప్స్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, ఆమె వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని మైక్‌లో శృతి చెప్పిన‌ప్ప‌టికీ వినిపించుకోలేద‌ని డీసీపీ పేర్కొన్నారు. నిన్న ఆందోళ‌నలు చేసి, పోలీసుల‌పైకి రాళ్లు రువ్విన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయ‌కులు, రాజ‌కీయ నాయ‌కుల‌పై కూడా కేసులు న‌మోదు చేశామ‌ని తెలిపారు.