నకిలీ మైసూర్ శాండల్ సబ్బుల స్కాంలో బీజేపీ నేతలు!
నకిలీ మైసూర్ శాండల్ సబ్బుల తయారీ కుంభకోణంలో బీజేపీ నేతల పాత్ర ఉన్నదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు.

- కర్ణాటక ప్రతిష్ఠను అమ్మేస్తున్న బీజేపీ
- నిందితులు బీజేపీ క్రియాశీల నాయకులు
- యూపీ సీఎం సహా పలువురి పాత్ర ఏంటి?
- కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపణలు
బెంగళూరు : నకిలీ మైసూర్ శాండల్ సబ్బుల కుంభకోణంలో నిందితులు బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. కర్ణాటక ప్రతిష్ఠను తెగనమ్మేందుకు తెగించారని మండిపడ్డారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) ఇటీవల హైదరాబాద్‌లో నకిలీ మైసూర్ శాండల్ సబ్బుల తయారీ యూనిట్ గుట్టును రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతరుల పాత్రను ఖర్గే ప్రశ్నించారు. బుధవారం బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రియాంక్ ఖర్గే.. నిందితుల నుంచి బీజేపీ నాయకులు కమీషన్లు పొంది ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ‘నకిలీ మైసూర్ శాండల్ సబ్బుల తయారీ యూనిట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మహవీర్ జైన్, రాకేశ్ జైన్ అరెస్టయ్యారు. వారిద్దరూ బీజేపీ క్రియాశీల నాయకులని విచారణ సందర్భంగా వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ చిత్తాపూర్ అభ్యర్థి మణికంఠ్ రాథోడ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు విఠల్ నాయక్‌తో నిందితులు కలిసి ఉన్న ఫోటో ఉన్నది’ అని ఆయన చెప్పారు.
ఈ కుంభకోణంలో బీజేపీ నేతల పాత్రను కూడా ఆయన ప్రశ్నించారు. ‘బీజేపీ నేతలు ఈ స్కాంలో భాగస్వాములయ్యారు. కర్ణాటక ‘ఆస్తి’ని వారు అమ్మేశారు. డబ్బుల విషయం వచ్చేసరికి బీజేపీ నేతలు మరో ఆలోచన చేయరు. ఈ కుంభకోణంలో బీజేపీ నేతల పాత్ర ఏంటని మేం వారిని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటివారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు?’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘బీజేపీ ఆఫీస్ బ్యారర్స్ హైదరాబాద్‌లో నకిలీ సబ్బుల రాకెట్ నడుపుతున్నారు. మైసూర్ శాండల్ సబ్బులు కర్ణాటక ప్రతిష్ఠకు చిహ్నం. మోదీ వోకల్ ఫర్ లోకల్ అని నినాదం ఇవ్వక ముందు నుంచే అది మాతో ఉన్నది. కర్ణాటక ప్రతిష్ఠను అమ్మేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు సిద్ధమయ్యారో చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో నకిలీ మైసూర్ శాండల్ సబ్బుల తయారీ కేంద్రం నడుస్తున్నదని కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందింది. దాని ఆధారంగా కేఎస్‌డీఎల్ విచారణ ప్రారంభించింది. కస్టమర్ల వేషాల్లో వెళ్లిన కేఎస్‌డీఎల్ అధికారులు.. పెద్ద సంఖ్యలో సబ్బులకు ఆర్డర్ ఇచ్చారు. అనంతరం యూనిట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ విషయంలో హైదరాబాద్‌లోని మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మహవీర్ జైన్, రాకేశ్ జైన్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.