అప్పులతో బాధపడుతున్నారా..? అయితే ఆ ఆలయానికి వెళ్తే అప్పులన్నీ తీరిపోతాయట..!
అప్పులతో బాధపడేవారు ఈ దేవాలయానికి వెళ్తే అప్పులన్నీ తీరిపోయి, సమస్యలు పరిష్కారం అవుతాయట. ఆ ఆలయమే చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి.

ఈ సమాజంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూనే ఉంటారు. కుటుంబ పరిస్థితులు, చాలిచాలనీ జీతాలు, సరైన ఆర్థిక వనరులు లేక చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. చేసిన అప్పులను తీర్చేందుకు పడరాని కష్టాలు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చుతారు. అలా అప్పులతో బాధపడేవారు ఈ దేవాలయానికి వెళ్తే అప్పులన్నీ తీరిపోయి, సమస్యలు పరిష్కారం అవుతాయట. ఆ ఆలయమే చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి.
ఆ ఆలయం ఎక్కడుందంటే..?
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఈ ఆలయంలోని స్వామి వారిని దర్శిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగిస్తే రుణ బాధలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ నేపథ్యం ఇదే..
పూర్వంలో వెంకటేశ్వర స్వామి – పద్మావతితో జరిగిన కల్యాణ మహోత్సవం సందర్భంగా కుబేరుని నుండి అప్పు తీసుకొని తీర్చలేక భయంతో తిరుపతి కొండపై నుంచి వచ్చి చిలుపూరు గుట్టుపై పాదాలు మోపి గుహలో దాక్కున్నట్టు చరిత్ర ఉంది. అప్పు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతుండడంతో స్వామివారికి బుగులు మొదలవుతుంది. అలా భయంతో స్వామివారి పడుకున్న సమయంలో చిలుపూరు ప్రదేశమంతా కలలో కనిపిస్తుంది. మేల్కొన్న తర్వాత చిలుకూరు గుట్ట దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ కొండపై ఉన్న గుహలోకి వెళ్లి స్వామివారు బుగులుతో తపస్సు చేస్తాడు. ఆ విధంగా అక్కడ వెలసిన వెంకటేశ్వరునికి గుబులు వెంకటేశ్వరుడని పేరు. అయితే చిలుపూరు గుట్ట ప్రదేశానికి స్వామి వారు వెళ్తేనే ఆయన అప్పులకు పరిష్కారం దొరికిందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి చాలామంది భక్తులు అప్పులు, ఇతర ఏదైనా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటే అన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాకతీయ రాజులు స్థానిక ప్రజల సమాచారం మేరకు స్వామి వారు వెలిసిన చోట పూజలు చేయడం ప్రారంభించారు. 14వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది. కొండ కింది భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఈ విధంగా స్వామివారి పాదాలు ఉన్న చోటును పాదాల గుండు అని పిలుస్తారు.