పద్మవిభూషణ్ తర్వాత తొలిసారి ఈవెంట్‌కి వచ్చిన చిరంజీవి.. వాడిపై నాకు చాలా కోపం ఉందన్న మెగాస్టార్

రిపబ్లిక్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. భారతదేశం రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న తర్వాత చిరు మీడియాతో మాట్లాడింది లేదు, ఏ ఈవెంట్‌కి వచ్చిన తన సంతోషాన్ని పంచుకుంది లేదు. కాని తొలిసారి తన ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వేడుకకు చిరంజీవి గెస్ట్‌గా రావడం ఆసక్తికరంగా మారింది.మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో ఈ చిత్రం విడుదల కాబోతుండగా, గత రాత్రి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ఈవెంట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ ఈవెంట్లో యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు అడగగా చిరు, వరుణ్ వాటికి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
వరుణ్ – లావణ్య లవ్ గురించి మీరు ఎందుకు లీక్ చేయలేదు అని సుమ.. చిరంజీవిని అడగ్గా దానికి స్పందిస్తూ ఈ విషయం నాకు చెప్పలేదు. వాళ్ల నాన్నకి చెప్పనవి కూడా నాకు చెప్తాడు. కాని ఈ విషయం నాకు చెప్పలేదు. అందుకే నాకు వరుణ్‌పై చాలా కోపం ఉందని అన్నారు. దీనికి వరుణ్ స్పందిస్తూ.. అది గౌరవంతో కూడిన భయం వలన చెప్పలేదు. అంతా ఓకే అయ్యాక మొదట ఆ విషయాన్ని పెద్దనాన్నకే చెప్పాను అని వరుణ్ అన్నారు. ఇక ఈవెంట్‌లో చిరు స్పీచ్ చాల ఆసక్తికరంగా సాగింది. పరిశ్రమకి వచ్చినప్పటి నుంచీ వరుణ్ నన్ను ఫాలో అవ్వట్లేదు. మా కుటుంబంలో ఏ హీరోకి రాని అవకాశాలు, డిఫరెంట్ రోల్స్ వరుణ్ తేజ్‌కి వచ్చాయి అని చిరంజీవి అన్నారు.
వరుణ్ తేజ్ ప్రతి సినిమాని చాలా ప్లాన్‌డ్‌గా చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. తను చేసిన 13 సినిమాలు చాలా డిఫరెంట్ మూవీస్ కాగా, ఇప్పుడు తెలుగులో తొలిసారి ఒక ఎయిర్ స్ట్రైక్ మీద తీసిన మొట్ట మొదటి సినిమా ఇది కావడం గర్వంగా ఉంది. ఏడాది క్రితం ‘టాప్ గన్’ అనే హాలివుడ్ మూవీ చూసి ఇలాంటివి మనం తీయగలమా అని అనిపించింది. కానీ ఈ మూవీలో సీన్స్ చూశాకా అలాంటి సినిమాను మన తెలుగోళ్లు ఈజీగా చేసి అవతల పడేశారంటే.. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అని నాకు అనిపించింది. ఈ సినిమాని కేవలం 75 రోజుల్లో ఈ సినిమా తీశారు అంటూ చిరంజీవి చిత్ర బృందంపై పొగడ్తల వర్షం కురిపించారు.