ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఎత్తేసే టైమ్‌.. ప్రజానాడిని పసిగడతాయా?

డిసెంబర్‌ మూడున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఉన్నా.. ఈలోపే 30వ తేదీన వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌పై అందరి దృష్టి నెలకొని ఉన్నది.

ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఎత్తేసే టైమ్‌.. ప్రజానాడిని పసిగడతాయా?

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్‌ 30వ తేదీ సాయంత్రం వరకూ ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియగా.. ఐదో రాష్ట్రమైన తెలంగాణలో మరికొద్ది గంటల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరుగనున్నప్పటికీ.. యావత్‌ దేశ ప్రజలు మాత్రం 30 వ తేదీన పోలింగ్‌ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇప్పటికే నాలుగు రాష్ట్రాల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ఆ సమయంలో చేసిన ఎగ్జిట్‌పోల్‌ సర్వేల ఫలితాలను ఈసీ నిషేధం నేపథ్యంలో ఆయా సంస్థలు నిలిపి ఉంచాయి. తెలంగాణలో పోలింగ్‌ ముగియడంతోనే ఎగ్జిట్‌పోల్స్‌పైనా నిషేధం ఎత్తేస్తారు. దీంతో ఇక చానళ్లన్నీ ఎగ్జిట్‌పోల్స్‌తో హోరెత్తిపోనున్నాయి. అయితే ఇప్పటి వరకూ కొన్ని ఒపీనియన్‌ పోల్స్‌ వచ్చినా.. అవికానీ, పోలింగ్‌ తర్వాత వెలువడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వివరాలు కానీ ఎంత మేరకు ప్రజాభిప్రాయాన్ని పసిగడతాయనే అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కొంతమేరకు వాతావరణ ఎటువైపు మొగ్గు చూపుతున్నదో తెలిసే అవకాశాలు ఉన్నాయని అందరూ చెబుతున్నారు.


మిజోరం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీలకు వరుసగా నవంబర్‌ 7, 17, 25వ తేదీల్లో ఒకే విడుతలో పోలింగ్‌ నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలు రెండు విడుతల్లో నవంబర్‌ 7, 17వ తేదీల్లో జరిగాయి. ఇక తెలంగాణ ఒకే విడుతలో 30న పోలింగ్‌కు వెళ్లనున్నది. నవంబర్‌ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌పోల్స్‌పై ఈసీ నిషేధం విధించింది. దీంతో ప్రజలు, రాజకీయ పరిశీలకులు, ఎలక్ట్రానిక్‌ మీడియా చానళ్ల దృష్టి ఎప్పుడు సమయం 6.30 గంటలు అవుతుందనే దానిపైనే కేంద్రీకృతమైంది.