స్పృహ కోల్పోయిన నాగుపాము.. ఆక్సిజ‌న్ అందించిన వైద్యులు

స్పృహ కోల్పోయిన నాగుపాము.. ఆక్సిజ‌న్ అందించిన వైద్యులు

రాయిచూర్ : స్పృహ కోల్పోయిన నాగుపాముకు ఆక్సిజ‌న్ అందించి కాపాడారు వైద్యులు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని రాయిచూర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. లింగ‌సాలూరు తాలుకా ప‌రిధిలోని హ‌ట్టి చిన్న‌గాని గ్రామంలో ఇన్నోవా కారును పార్కు చేశారు. ఆ కారులోకి నాగుపాము దూరింది. అయితే కారులో ఉన్న నాగుపామును బ‌య‌ట‌కు తీసేందుకు హ‌ట్టి గోల్డ్ మైనింగ్ కంపెనీ డాక్ట‌ర్ ర‌వీంద్ర‌నాథ్ చాలా ప్ర‌య‌త్నించాడు. కానీ ఆ పాము బ‌య‌ట‌కు రాలేదు. దీంతో స్థానికులు పాముపైకి ఫినైల్ స్ప్రే చేశారు. అనంత‌రం పాము స్పృహ కోల్పోయింది.

పాము ఎంత‌సేప‌టికి క‌ద‌ల‌క‌పోవ‌డంతో.. స్నేక్ క్యాచ‌ర్, మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఖ‌లీద్ చావుస్‌కు స‌మాచారం అందించారు. అత‌ను అక్క‌డికి చేరుకుని పామును ప‌ట్టుకున్నాడు. అనంత‌రం దాన్ని స‌మీప ఆస్ప‌త్రికి తీసుకెళ్లి, స్ట్రా స‌హాయంతో ఆక్సిజ‌న్‌ను అందించారు. కాసేప‌టికి పాములో స్పృహ వ‌చ్చింది. ఆ త‌ర్వాత నాగుపామును స్థానికంగా ఉన్న అడ‌వుల్లో వ‌దిలేశారు.