Covid-19 | మళ్లీ కరోనా అలజడి..! పెరుగుతున్న కేసులు.. మరణాలు..!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్నది.

Covid-19 | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్నది. రూపం మార్చకుంటూ వస్తూ ఆందోళనకు గురి చేస్తున్నది. 2019 డిసెంబర్‌లో చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించింది. మొన్నటి వరకు శాంతించిందనకున్న వైరస్ మరోసారి తాజాగా జేఎన్.1 వేరియంట్ రూపంలో వచ్చి జడలు విప్పుతున్నది. ఇప్పటి వరకు కొత్త వేరియంట్ చైనా, సింగపూర్, అమెరికా, భారత్ సహా 41 దేశాల్లో కనిపించింది. ఇది ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్ సబ్ వేరియంట్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ తరహాలోనే వేరియంట్‌కు వేగంగా వ్యాపించే లక్షణాలు ఉంటాయని నిపుణులు హెచ్చరించారు. వైరస్ సోకిన వారికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు గుర్తించారు. ఇటీవల సింగపూర్, అమెరికాలో కొత్త వేరియంట్‌తో కేసులు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. గత నాలుగేళ్లు ఈ వైరస్ ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నది. 2023లో తగ్గుతున్న ఇన్ఫెక్షన్ ప్రమాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మే నెలలో ‘గ్లోబల్ హెల్త్ రిస్క్’ జాబితా నుంచి కరోనాను తొలగించింది. అయితే, కొత్త వేరియంట్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో భారత్ రెండోస్థానంలో ఉన్నది. అమెరికాలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి అమెరికాలో 110,462,560 మంది కరోనా బారిన పడగా.. 1,191,815 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో మొత్తం 45,020,333 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,33,409 మంది మహమ్మారికి బలయ్యారు. ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీలో అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. గతేడాదిలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అయితే, నవంబర్-డిసెంబర్ మధ్యలో జేఎన్.1 వేరియంట్ కారణంగా చాలా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గురువారం వరకు 12 రాష్ట్రాల్లో 827 మంది కొత్త వేరియంట్ నిర్ధారణ అయ్యింది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాపించే గుణం ఉందని, శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి సులభంగా తప్పించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా కేసుల పెరుగుదలకు కారణమవుతుందని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జేఎన్.1ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది.
భారత్‌లో కరోనా మొదటి వేవ్‌లో కేసులు తక్కువగానే నమోదయ్యాయి. జనం సైతం భయాందోళనకు గురై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, సెకండ్ వేవ్‌లో భారత్‌లో కరోనా కేసులు పతాక స్థాయికి చేరాయి. అదే సమయంలో వైరస్ చాలా మందిని పొట్టనబెట్టుకున్నది. సెకండ్ వేవ్‌లో ప్రధానంగా డెల్టా వేరియంట్ ప్రభావం కనిపించింది. ఆల్ఫా-బీటా వేరియంట్ మొదటి వేవ్ పెద్దగా ప్రభావం కనిపించలేదు. నవంబర్ 2020 – ఫిబ్రవరి 2021 మధ్య కేసులు తగ్గాయి. 2021 ఫిబ్రవరి తర్వాత డెల్టా వేరియంట్ కారణంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేరియంట్‌తో శ్వాసకోశ సమస్యలు, ఐసీయూ, వెంటిలెటర్ అవసరం ఎక్కువగా అవసరమైంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడంతో పాటు మరణాలు సైతం భారీగానే నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా భారీగానే ప్రభావం చూపింది.
డెల్టా వేరియంట్ తర్వాత గామా వేరియంట్ పుట్టుకు వచ్చింది. ఆ తర్వాత ఒమిక్రాన్ మరోసారి ప్రపంచంవ్యాప్తంగా పంజా విసిరింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. గత రెండు సంవత్సరాలుగా ఒమిక్రాన్ మ్యుటేషన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకువచ్చాయి. ఈ వేరియంట్లతో ముప్పు పొంచి ఉన్నది. ప్రస్తుతం జేఎన్.1 వేరియంట్ ప్రమాదాన్ని పెంచుతున్నది. జేఎన్.1 వేరియంట్ బీఏ.2.86 వేరియంట్ నుంచి పుట్టుకువచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ స్వభావం డెల్టా వేరియంట్ తరహాలో తీవ్రమైన ముప్పు ఏమీ ఉండదని.. వేరియంట్లు మాత్రం కేసుల పెరుగుదలకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కేసులు పెరుగుతూ వస్తే మరిన్ని వేరియంట్లు పుట్టుకువచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం.. రద్దీ ప్రదేశాలు దూరంగా ఉండడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.