Crocodile | హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. ఖైర‌తాబాద్‌లో మొస‌లి ప్ర‌త్య‌క్షం

Crocodile | హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. ఖైర‌తాబాద్‌లో మొస‌లి ప్ర‌త్య‌క్షం

Crocodile | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో బుధ‌వారం రాత్రి భారీ వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. ఈ భారీ వ‌ర్షానికి న‌గ‌రంలోని నాలాల‌న్నీ ఉప్పొంగాయి. ఖైర‌తాబాద్‌లోని చింత‌ల్ బ‌స్తీ వ‌ద్ద ఉన్న నాలాలో ఓ మొస‌లి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఐదు అడుగుల పొడ‌వున్న ఓ మొస‌లి పిల్ల ఒడ్డుకు చేర‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

చింత‌ల్ బ‌స్తీ – ఆనంద్ న‌గ‌ర్ మ‌ధ్య ఉన్న బ‌ల్కాపూర్ నాలాలో మొస‌లి పిల్ల క‌నిపించింద‌ని స్థానికులు చెబుతున్నారు. నూత‌న బ్రిడ్జి నిర్మాణం కోసం కూల్చివేత‌లు చేప‌ట్టిన ప్రాంతంలో మొస‌లి పిల్ల ఒడ్డుకు చేరింద‌న్నారు. ఆ మొస‌లిని క‌ట్టెల‌తో కొట్టేందుకు స్థానికులు య‌త్నించారు. అది కాస్త ముందుకు క‌ద‌ల‌డంతో యువ‌కులు ప‌రారీ అయ్యారు.

మొస‌లి పిల్ల గురించి స్థానికులు అట‌వీశాఖ‌, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌కు స‌మాచారం అందించారు. నాలాలో మొసలి పిల్ల ఒకటే ఉందా? లేక ఇంకా ఎన్ని ఉన్నాయి? అని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మొసలి పిల్ల ప్రస్తుతం ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చిందని దానిపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ శివార్లలోని హిమాయత్ సాగర్‌లో, దాని సమీపంలోని నాలాలో మొసళ్లు కనిపించాయని గతంలోనూ వార్తలు వచ్చిన సంగ‌తి తెలిసిందే.