ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఆర్సీబీ-ఢిల్లీ మ్యాచ్‌.. మ‌రో జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి..!

ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఆర్సీబీ-ఢిల్లీ మ్యాచ్‌.. మ‌రో జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి..!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో కొన్ని మ్యాచ్‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగాయో మ‌నం చూశాం. ఇక సిరీస్ తుది ద‌శ‌కు చేరుకుంటున్న నేప‌థ్యంలో ప్ర‌తి మ్యాచ్ కూడా ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ అందిస్తుంది. ఆదివారం జరిగిన 17వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా పోటీ ప‌డ్డాయి. అయితే చివ‌రి వ‌ర‌కు చాలా ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒకే ఒక్క ప‌రుగు తేడాతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది. ఇప్పటికే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కూడా ప్లే ఆఫ్స్‌కి చేరుకున్న విష‌యం తెలిసిందే.

17వ మ్యాచ్‌లో ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ (58) అర్ధ సెంచరీతో రాణించ‌గా మిగ‌తా బ్యాట‌ర్లు త‌మ వంతు స్కోర్స్ చేయ‌డంతో ఈ మాత్రం స్కోరు వ‌చ్చింది. ఇక 182 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిచా ఘోష్ చివరి వరకు పోరాడిన‌ప్ప‌టికీ త‌మ జ‌ట్టుకి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. అయితే ఆర్సీబీకి రెండో ఓవ‌ర్‌లోనే పెద్ద షాక్ త‌గిలింది. 5 పరుగుల స్కోరు వద్ద కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్‌లో ఆలిస్ క్యాప్సీ అవుటైంది.

ఆ తర్వాత సోఫీ మోలినిక్స్, ఎల్లీస్ పెర్రీ రెండో వికెట్‌కు 80 పరుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అయితే 11వ ఓవర్ చివరి బంతికి ఎల్లీస్ పెర్రీ రనౌట్ అయింది. ఒక్క ప‌రుగు తేడాతో అర్ధ సెంచ‌రీ మిస్ చేసుకున్న పెర్రీ 7 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. ఇక త‌ర్వాతి ఓవ‌ర్‌లో సోఫీ మోలినెక్స్ 30 బంతుల్లో 33 పరుగులు చేసి అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో ఔట్ అయింది.ఇక సోఫీ డివైన్ 16 బంతుల్లో 26 పరుగులు చేసింది. 19వ ఓవర్ చివరి బంతికి జార్జియా వేర్‌హామ్ క్యాచ్ ఔట్ కాగా, చివరి ఓవ‌ర్ చాలా ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిచింది. 29 బంతుల్లో 51 ప‌రుగుఉల చేసిన రిచా ఘోట్ ర‌నౌట్ కావ‌డం ఆ టీమ్‌కి పెద్ద ఇబ్బందిగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మారిజానే కాప్, అలిస్ క్యాప్సీ, శిఖా పాండే, అరుంధతి రెడ్డి ఒక్కో వికెట్ సాధించారు.