లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌

లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌

లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌

పదోసారి సమన్లు.. స్టేట్‌మెంట్‌ రికార్డ్‌

2 గంటల విచారణ అనంతరం అరెస్ట్‌

ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు 2024, మార్చి 21వతేదీ రాత్రి అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసుల ఎస్కార్ట్‌తో సివిల్‌ లేన్స్‌లోని కేజ్రీవాల్‌ నివాసానికి సెర్చ్‌వారెంట్‌తో వచ్చిన ఆరుగురు సభ్యుల ఈడీ బృందం.. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. ఆయనకు పదోసారి సమన్లు జారీచేసి, మనీ లాండరింగ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్‌ 50 ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన అనంతరం అరెస్టు చేశారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కేజ్రీవాల్‌ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల వ్యవధిలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. ఒకవైపు కేజ్రీవాల్‌ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్న సమయంలోనే ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేయడంపై అర్జెంటుగా విచారణకు స్వీకరించాలని అభిషేక్‌ మను సింఘ్వి నేతృత్వంలోని న్యాయవాదులు ఈ-పిటిషన్‌ దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ నివాసంలోకి ప్రవేశించగానే తొలుత ఇంట్లోని వారందరి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.


ఇదే కేసులో ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు మనీశ్‌ సిసోడియా, సంజయ్‌సింగ్‌లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆరెస్‌ ఎమ్మెల్సీ, సౌత్‌ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్న కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.


ఢిల్లీలోని సివిల్‌ లేన్స్‌లో ఉన్న కేజ్రీవాల్‌ నివాసంలోకి తనను వెళ్లనీయలేదని అంతకు ముందు ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ చెప్పారు. భారీ ఎత్తున మోహరించిన ఢిల్లీ పోలీసులు.. కేజ్రీవాల్‌ నివాసంవైపు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో ఆప్‌ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేజ్రీవాల్‌ నివాసం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. అక్కడకు చేరుకున్న కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


తాము కేజ్రీవాల్‌ను లేదా ఆయన కార్యదర్శిని కాంటాక్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నా వీలు కాలేదని ఆయన తెలిపారు. వారి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని ఉంటారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే వారు వచ్చారని ఆరోపించారు. అయితే.. కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చేందుకు తాము వచ్చామని తొలుత ఈడీ అధికారులు పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. వారు తమ వెంట సెర్చ్‌ వారెంట్‌ కూడా తీసుకొచ్చారని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. విచారణకు హాజరుకావాలని సమన్లు పంపినా గతంలో పలుమార్లు ఆయన హాజరుకాలేదు.

ఈడీ దర్యాప్తునకు సహకరించేందుకు కేజ్రీవాల్‌ సిద్ధంగానే ఉన్నారని, అయితే.. ఈడీ కేవలం దర్యాప్తు సంస్థ మాత్రమేకాదని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించాలని చూస్తున్న బీజేపీ చేతిలో రాజకీయ ఆయుధమన్నది తమ అభిప్రాయమని ఆప్‌ నేతలు చెబుతున్నారు.

గత 2023, అక్టోబర్‌ నెలలో మొదటిసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపింది. అప్పుడు కేజ్రీవాల్‌ను ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేజ్రీవాల్‌ను తీసుకొని వచ్చిన ఈడీ కార్యాలయం ఉన్న అక్బర్‌ రోడ్డు పరిసరాల్లోనూ నిషేధాజ్ఞలు విధించారు.