ఏ చట్టం ప్రకారం ధరణిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు? అధికారులను నిలదీసిన కమిటీ
వ్యవసాయ భూములు ఒక దగ్గర, వ్యవసాయేతర భూములు మరో దగ్గర రిజిస్ట్రేషన్లు చేయాలని ఏ చట్టం చెప్పింది? అని అధికారులను ధరణి కమిటీ ప్రశ్నించింది.

- రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేశారా?
- కేంద్రం అనుమతి తీసుకున్నారా?
- నిషేధిత జాబితాలో ఈ తేడాలేంటి?
- టీఎస్ఐఐసీ 35 వేల ఎకరాలు ఎక్కడ?
- ధరణిలో ఉంది 25 వేల ఎకరాలే!
- అధికారులను నిలదీసిన కమిటీ
విధాత: రిజిస్ట్రేషన్ల చట్టం ఏం చెపుతున్నది? మీరు ఏం చేశారు? వ్యవసాయ భూములు ఒక దగ్గర, వ్యవసాయేతర భూములు మరో దగ్గర రిజిస్ట్రేషన్లు చేయాలని ఏ చట్టం చెప్పింది? ఏ చట్టం ప్రకారం విడివిడిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు? అంటూ ధరణి కమిటీ.. అధికారులను ప్రశ్నించింది. బుధవారం సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, టీఎస్ ఐఐసీ అధికారులతో సమావేశమైంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908కి ఏమైనా సవరణలు చేశారా? ఈ మేరకు సవరణల కోసం కేంద్రం అనుమతి తీసుకున్నారా? అని కమిటీ అడిగింది. ఏ చట్టం ప్రకారం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో తమకు తెలియదని రిజిస్ట్రేషన్ అధికారులు కమిటీకి తెలిపారు. వ్యవసాయ భూములు ఒకచోట, వ్యవసాయేతర భూములు మరోచోట రిజిస్ట్రేషన్ చేయాలని ఏ చట్టంలోనూ లేదన్నారు. అలాంటప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను తప్పించి ధరణి పోర్టల్‌లో తాసిల్దార్లకు ఎలా ఎందుకు అప్పగించారో తమకు ఎలా తెలుస్తుందన్నారు. ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. చట్టం లేకుండా ఇలా జరిగిన రిజిస్ట్రేషన్లకు ఉన్న చట్టబద్ధత ఏమిటన్న సందేహాలు కమిటీ ముందు వ్యక్తమయ్యాయి.
ఇష్టారీతిన గత ప్రభుత్వ నిర్ణయాలు
ధరణిలో వ్యవసాయ భూములను, రిజిస్ట్రేషన్ల శాఖలో వ్యవసాయేతర భూములను వేర్వేరుగా రిజిస్ట్రేషన్లు చేయాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టయితే.. దానికి ముందు పాటించాల్సిన పద్ధతులు ఉన్నాయి. రాష్ట్రంలో నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు కోరుతూ కేంద్రానికి పంపినట్టే.. దీనిపైనా కేంద్రానికి పంపించి, కేంద్ర చట్టంలో సవరణ కోరాల్సి ఉంటుంది. కానీ.. నాటి బీఆరెస్ ప్రభుత్వం ఈ పని చేయకుండా ఇష్టారీతిన చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ధరణిలో రిజిస్ట్రేషన్లు జరిగే తీరుపై రిజిస్ట్రేషన్ల శాఖే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
నిషేధిత భూముల వివరాలు ధరణిలో ఒకలా.. రిజిస్ట్రేషన్ల శాఖలో మరోలా!
నిషేధిత భూముల జాబితా వివరాలు ధరణిలో ఒక విధంగా, రిజిస్ట్రేషన్ శాఖలో మరో విధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కమిటీకి వివరించారు. ధరణిలో టీఎం 15 కింద నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించలేదన్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా, ప్లాట్లను వ్యవసాయ భూములుగా రెండు చోట్ల రిజిస్ట్రేషన్లు చేయడం డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొనుగోలు చేసిన భూ యజమానులు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ధరకు స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటే, ధరణిలో కార్డు విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుందని, మరో ఆప్షన్ లేదని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో భారీ కోత పడినట్లు తెలిపారు. ఇదే తీరుగా ధరణిలో స్లాట్‌బుక్ చేసుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కానీ రిజిస్ట్రేషన్ శాఖలో అగ్రిమెంట్ చేసుకున్నతరువాత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేకుంటే పెనాల్టీ వసూలు చేస్తారని తెలిపారు.
టీఎస్ ఐఐసీకి 60 వేల ఎకరాల భూములుంటే ధరణిలో కేవలం 25 వేల ఎకరాలు మాత్రమే చూపిస్తోందని, మిగిలిన 35 వేల ఎకరాల భూమి వివరాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదని అధికారులు కమిటీకి తెలిపారు. దీంతో కమిటీ విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. సేకరించిన ఈ భూమి రైతుల పేరున ఉందా? లేదా? ఈ భూములకు రైతు బంధు వెళుతుందా? లేదా? రైతుల నుంచి సేకరించిన ఈ భూమి ఇంకా రియల్ రాబందుల కబంధ హస్తాల్లో చిక్కిందా? అన్న సందేహాలు వ్యక్తమైనట్లు సమాచారం. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రేమండ్ పీటర్, పీ మధుసూదన్, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎంఆర్వో వీ లచ్చిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.