రెండో రోజు ఇంగ్లండ్ బౌలర్ల జోరు..భారత్ ఎంత స్కోరు చేసిందంటే..!..!

రాంచీ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు పట్టు బిగిస్తున్నట్టుగా కనిపిస్తుంది.ఈ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు మంచి స్కోరు సాధించింది. ఒక దశలో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఈ జట్టుని రూట్ ఆదుకున్నాడు. 122 పరుగులతో రూట్ అజేయంగా నిలవగా, ఆయనకి తోడుగా రాబిన్సన్ 58, బెన్ ఫోక్స్ 47, ఓపెనర్ జాక్ క్రాలీ 42 విలువైన రన్స్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు 353 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్స్‌లో జడేజా మరోసారి విజృంభించాడు. కీలకమైన 4 వికెట్లు తీసుకోగా, రెండో రోజు మూడు వికెట్స్ తీసుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లని వెంటవెంటనే పెవీలియన్‌కి పంపాడు.
మిగతా బౌలర్ల విషయానికి వస్తే తొలి రోజే ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు. ఇండియాతో టెస్టు సిరీస్ లో తొలి మూడు టెస్టుల్లో దారుణంగా విఫలమైన రూట్ రాంచీ టెస్ట్‌లో మాత్రం సూపర్ సెంచరీ నమోదు చేసి సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. ఇండియాపై టెస్టుల్లో అతనికిది 10వ సెంచరీ కాగా, ఇప్పటి వరకూ 9 సెంచరీలతో స్టీవ్ స్మిత్ పేరిట ఉన్న రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఓవరాల్ గా రూట్ టెస్టుల్లో 31 సెంచరీలు చేయగా.. అందులో పది ఇండియాపైనే ఆయన చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇంగ్లండ్ టీమ్ తమ బజ్‌బాల్ పక్కన పెట్టి డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయి ఈ మ్యాచ్‌లో మంచి స్కోరే చేసింది.
ఇక ఇంగ్లండ్ ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ మొదట్లోనే తడబడింది. రోహిత్ శర్మ(2) ఆరంభంలోనే వెనుదిరగ్గా.. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(38)తో కలిసి యశస్వి జైస్వాల్ రెండో వికెట్‌కు 82 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా జైస్వాల్ మాత్రం నిదానంగా డుతూ స్కోరుని ముందుకు నడిపించాడు.అయితే 73 పరుగులు చేసిన జైస్వాల్ బషీర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవీలియన్ చేరాడు. ఇక రజత్ పటీదార్(17)తో పాటు , రవీంద్ర జడేజా(12) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన వారిని బషీర్ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో భారత్ 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(14) నెండు సార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నా హార్ట్‌లీ బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక అశ్విన్(1) పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆట పూర్తయ్యే సరికి క్రీజులో జురెల్( 30 నాటౌట్), కుల్దీప్( 17 నాటౌట్‌గా ఉన్నారు. ఇక భారత్ ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 134 పరుగులు వెనకంజలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్స్‌లో బషీర్ నాలుగు వికెట్స్ పడగొట్టాడు. హార్ట్‌లీ 2, అండర్సన్‌కి ఒక వికెట్ దక్కింది.