Sri Rama Navami | సీతారాముల కల్యాణానికి సిద్ధమవుతున్న భద్రాచలం..! ఆన్‌లైన్‌లో అందుబాటులోకి కల్యాణం టికెట్లు..

Sri Rama Navami | సీతారాముల కల్యాణానికి సిద్ధమవుతున్న భద్రాచలం..! ఆన్‌లైన్‌లో అందుబాటులోకి కల్యాణం టికెట్లు..

Sri Rama Navami | మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి కల్యాణ వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతున్నది. ఇక్కడ జరిగే కల్యాణ వేడుకలకు ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ అంటేనే గుర్తుకు వచ్చేది భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం. ఇక్కడ ఏటా కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఈ ఏడాది ఆలయంలో ఏప్రిల్​17న సీతారాముల కల్యాణం నిర్వహించాలని వైదిక కమిటీ ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్‌ 9న ఉగాది నుంచి 23వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 13న మండల లేఖన, కలశ, యాగశాల, అలంకరణాదులు, సార్వభౌమ వాహన సేవ, 14న గరుడ ధ్వజపట లేఖనం, ఆవిష్కరణ, గరుడాధివాసం, 15న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీతాడనం, దేవతాహ్వానం, బలిసమర్పణం, హనుమంత వాహన సేవ, 16న యాగశాల పూజ, చతుఃస్థానార్చన, ఎదుర్కోలు, 17న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, 18న మహాపట్టాభిషేకం, 19న మహదాశీర్వచనం, 20న తెప్పోత్సవం, డోలోత్సవం, 21న ఊంజల్​సేవ, 22న వసంతోత్సవం, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధజ్వావరోహణం, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్​9 నుంచి 23 వరకు నిత్య కల్యాణాలు, దర్బారు సేవలను రద్దు చేశారు. మే 1వ తేదీ వరకు పవళింపు సేవలు జరగవని ఆలయ అధికారులు తెలిపారు. భద్రాచలం దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించే ముహూర్తమే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి నిర్వహణకు కొలమానంగా నిలుస్తుంది.

పెళ్లికి ముహూర్తం ఖ‌రారు..

శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చిందని కూడా పురాత‌న గ్రంథాలు చెబుతున్నాయి. మాన‌వ రూపంలో ఆ భ‌గ‌వంతుడు వెల‌సిన ఈరోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు సీతారాముల కల్యాణం సైతం నిర్వహిస్తారు. ఈ నేప‌థ్యంలోనే శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏప్రిల్‌ 9న 22న ఉగాది పండగను పురస్కరించుకుని నూతన పంచాంగ శ్రవణం ఆలయంలో నిర్వహించనున్నారు. భద్రాచల రామయ్య వివాహ మహోత్సవానికి ఏప్రిల్‌ 17న ముహూర్తం ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

తలంబ్రాల వేడుక..

సీతారాముల కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను, వసంతోత్సవాన్ని, డోలోత్సవాన్ని ఘనం జరిపేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సీతారాముల కల్యాణానికి 150 క్వింటాళ్లకుపైగా బియ్యం, ఒక క్వింటాకుపైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు. పండితుల వేద మంత్రాల న‌డుమ‌ సీతారామ‌చంద్రుల వివాహం వైభ‌వోపేతంగా జ‌రుపుతారు. ఆ త‌ర్వాత‌ వ‌రుడు త‌ర‌ఫున ఒక‌రు, వ‌ధువు త‌ర‌ఫున మ‌రొక‌రు పండితులు ముత్యాల త‌లంబ్రాలు తీసుకుని సీతారాముల విగ్రహాలపై పోస్తారు. చ‌రిత్రను కాపాడే లక్ష్యంతో ఐదు ర‌కాల ద్రవ్యాల‌తో ఈ త‌లంబ్రాలు త‌యారు చేస్తారు. ఉత్సవాలు, కళ్యాణం, పట్టాభిషేకానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం టికెట్లు..

భద్రచాలంలో వైభవంగా జరిగే సీతారాముల కల్యాణం, పట్టాభిషేక వేడుకలకు సంబంధించిన టికెట్లను దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్‌ 17న సీతారాముల కల్యాణం, 18న పట్టాభిషేకం జరుగనున్నది. శ్రీరామ నవమి రోజు ఉభయ దాతల సేవా టికెట్‌ రుసం రూ.7,500గా నిర్ణయించారు. ఈ టిక్కెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పిస్తారు. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. 18వ తేదీన జరిగే పట్టాభిషేక మహోత్సవం సెక్టార్‌ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100 అధికారులు నిర్ణయించారు. రాముల వారి కల్యాణం రోజు ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్ర నామాలతో పూజ చేయించుకునేందుకు ఆలయం అధికారులు అవకాశం కల్పించారు. రూ.5వేలు, రూ.1116 టికెట్లనూ బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. టికెట్లను bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.