ఓబీసీ నాన్ క్రీమిలేయర్‌ సర్టిఫికెట్ పొందేందుకు అర్హతలు ఇవే

ఓబీసీల్లో క్రీమిలేయర్‌, నాన్‌ క్రీమిలేయర్‌ గుర్తింపునకు అనుసరించే ప్రమాణాలు ఇవే..

ఓబీసీ నాన్ క్రీమిలేయర్‌ సర్టిఫికెట్ పొందేందుకు అర్హతలు ఇవే

ఓబీసీల్లో ఎవరు సంపన్న శ్రేణి?

ఎవరిని క్రీమిలేయర్‌గా పరిగణణించరు?


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నది. దీనితోపాటు వచ్చే 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. వీటికి.. అర్హులైన బీసీ అభ్యర్థులు రాష్ట్రస్థాయిలో నాన్ – క్రీమిలేయర్ సర్టిఫికెట్, సెంట్రల్ లెవెల్ జాబ్స్, విద్యాసంస్థలలో ప్రవేశం కోసం ఓబీసీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. దానిని సులభంగా పొందడం కోసం, వారికి గానీ జారీ చేసే అధికార యంత్రాంగానికి గానీ ఉండే పలు అనుమానాల నివృత్తి కోసం ఈ కథనం.

వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) మన రాష్ట్రస్థాయిలో (ఉమ్మడి AP) రిజర్వేషన్ సౌకర్యం (25%) 1970లో జీవో ఎంఎస్‌ 1793 ద్వారా, కేంద్రస్థాయిలో మండల్ కమిషన్ సిఫారసుల మేరకు (27%) 1993 నుండి కల్పించారు. కానీ, ఈ (ఓబీసీ) రిజర్వేషన్లు అమలు చేయటానికి వారిలోని క్రీమిలేయర్ (సంపన్నశ్రేణి)ను మినహాయించాలని సుప్రీంకోర్టు ఇందిరా సహానీ వర్సెస్‌ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు వెలువరించింది. ఆ తీర్పు మేరకు ఇతర వెనుకబడిన తరగతులలో క్రీమిలేయర్ (సంపన్నశ్రేణి)ను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని వేశారు. ఆ కమిటీ సూచనల మేరకు వెనుకబడిన తరగతులలో క్రీమిలేయర్‌ను గుర్తిస్తారు.


ఏమిటీ క్రీమిలేయర్?

ఓబీసీలలో సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని ‘సంపన్నశ్రేణి’ లేదా క్రీమిలేయర్‌గా పేర్కొంటారు.

క్రీమిలేయర్‌వారికి రిజర్వేషన్ వర్తిస్తుందా?

సంపన్నశ్రేణికి చెందినవారు వెనుకబడిన తరగతులవారైనప్పటికీ సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినందున రిజర్వేషన్ పొందుటకు అనర్హులు. వారు ఓపెన్ కేటగిరీలోనే పోటీపడాల్సి ఉంటుంది.

క్రీమిలేయర్‌ను గుర్తించడమెలా?

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ప్రకారం ఓబీసీల్లోని సంపన్నశ్రేణిని కింద పేర్కొన్న విధంగా గుర్తించడం జరుగుతుంది.

1.రాజ్యాంగంలో పొందుపర్చిన పోస్టుల్లో ఉన్నవారి పిల్లలు. ఉదాహరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు, పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు, యూపీఎస్సీ, పీఎస్సీల అధ్యక్షులు, సభ్యులు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌, కంప్ర్టోలర్‌ అండ్ ఆడిటర్‌ జనరల్‌, అటార్నీ జనరల్‌, అడ్వకేట్‌ జనరల్‌, అధికార భాషా సంఘం సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎగువ చట్టసభల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర పోస్టులలో ఉన్నవారు క్రీమిలేయర్‌గా గుర్తిస్తారు.


సివిల్ ఉద్యోగుల్లో

తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీసులలో నేరుగా నియామకాలు పొందినవారి పిల్లలు, తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్-1 స్థాయి ఉద్యోగంలో నేరుగా నియామకం పొందినవారి పిల్లలు, తల్లిదండ్రులిరువురూ గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారి పిల్లలు క్రీమిలేయర్‌ కోటాలోకి వస్తారు. తల్లదండ్రుల్లో ఏ ఒక్కరైనా గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో నేరుగా నియామకం పొంది, 40 ఏళ్లలోపు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగానికి ప్రమోషన్ పొందినవారు, 40 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 స్థాయికి పదోన్నతి పొందినవారి పిల్లలు క్రీమిలేయర్ కిందకు రారు. తల్లిదండ్రులిద్దరు లేదా ఒక్కరైనా గ్రూప్ -3 లేక గ్రూప్ – 4 స్థాయిలో తొలుత నియామకం పొంది, ప్రమోషన్ ద్వారా ఏ స్థాయికి చేరినా వారి పిల్లలను సంపన్న శ్రేణిగా పరిగణించరు.


సివిల్ ఉద్యోగుల విషయంలో వారు తొలుత నియామకం పొందిన స్థాయినిబట్టి వారి పిల్లలు సంపన్నశ్రేణి కిందకు వస్తారా? లేదా అనేది నిర్ణయిస్తారు. అంతేకానీ, వారు ప్రస్తుతం పొందుతున్న జీతభత్యాలను బట్టికాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం.. ‘ఉద్యోగులు’ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు. ప్రైవేటు ఉద్యోగులు ఈ క్యాటగిరీ కిందకు రారు.


మిలిటరీ మరియు పారామిలిటరీ దళాల్లో..

మిలిటరీ, పారా మిలిటరీలో పనిచేస్తున్న తల్లిదండ్రుల్లో ఏ వైకరైనా లేదా ఇద్దరూ కర్నల్‌ స్థాయి ఉద్యోగంలో ఉంటే.. వారి పిల్లలను సంపన్నశ్రేణిగా గుర్తిస్తారు. అంతకు తక్కువ స్థాయిలో ఉన్నవారికి క్రీమిలేయర్‌ వర్తించదు.


వృత్తినిపుణులు, వాణిజ్య, వ్యాపార వర్గాలు :

ప్రైవేటుగా ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్‌లు, ఇన్‌కం ట్యాక్స్‌ కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, సినీ ఆర్టిస్టులు, రచయితలు, పాత్రికేయులు, క్రీడాకారులు మొదలగువారిలో వారి ఆదాయాన్ని బట్టి సంపన్నశ్రేణిగా గుర్తిస్తారు. అంటే.. మూడేళ్లపాటు వార్షికాదాయం నిర్దేశిత ఆదాయ పరిమితిని దాటితే వారి పిల్లలను ‘సంపన్నశ్రేణి’గా గుర్తిస్తారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు.


ఆస్తిపరులు :

ఎ) వ్యవసాయ భూమి :

సాగునీటి సౌకర్యం కలిగి, భూపరిమితి చట్టం ప్రకారం ఉండగలిగిన భూమిలో 85 శాతం భూమి ఉన్నట్టయితే వారి పిల్లలను క్రీమిలేయర్‌గా పరిగణిస్తారు.

ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం ఉండి, మరికొంత భూమికి సాగునీటి సౌకర్యం లేనిపక్షంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి భూపరిమితి చట్టానికి అనుగుణంగా ఉండగలిగిన భూమిలో కనీసం 40 శాతానికి మించి ఉంటే మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మార్చి, రెంటినీ కలిపి, భూపరిమితి చట్టం ప్రకారం ఉండగలిగిన భూమిలో 80 శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు.

ఒకవేళ ఉన్నదంతా మెట్ట భూమే అయితే.. ఎంత భూమి ఉన్నా.. వారి పిల్లలు సంపన్నశ్రేణి కిందకు రారు.

ఇచ్చట ముఖ్య అంశమేంటంటే.. భూమి పరిమాణాన్ని బట్టి మాత్రమే క్రీమిలేయర్‌ను నిర్ణయిస్తారు. ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయంతో ఏ మాత్రం నిమిత్తం లేదు. ఉండవలసిన భూపరిమాణం కంటే తక్కువగా భూమి కలిగి ఉండి.. ఆ భూమి ద్వారా లభించే ఆదాయం సంపన్నశ్రేణి ఆదాయ పరిమితి కన్నా మించి ఉన్నా.. వారి పిల్లలను క్రీమిలేయర్‌ కింద చేర్చరు.


బి) మామిడి, బత్తాయి, నిమ్మ తదితర తోటలు :

ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి కాకుండా పైన పేర్కొన్న తోటలైన పక్షంలో వాటిని మామూలు సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తిస్తారు. అంటే భూపరిమితి చట్టం ప్రకారం 85శాతం కంటే ఎక్కువ భూమిని కలిగి, ఆ భూమిలో పైన పేర్కొన్న తోటలు ఉన్నట్టయితే వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు.

కాఫీ, టీ, రబ్బరు తదితర తోటలున్న భూమి సాధారణ వ్యవసాయ భూమి కాకుండా పైన పేర్కొన్న తోటలైతే వాటిపై లభించే ఆదాయాన్ని బట్టి క్రీమిలేయర్‌ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

సి) పట్టణాల్లో ఖాళీ స్థలం లేదా భవనములు కలిగి ఉండి.. ఆస్తిపన్ను వర్తిస్తున్నట్టయితే వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు.


మరికొన్ని వివరణలు :

1) సంపన్న శ్రేణి అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు, విద్యాసంస్థల్లో ప్రవేశానికి మాత్రమే వర్తింపచేయాలి.

2) ఉద్యోగుల విషయంలో క్రీమిలేయర్‌ను వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగ స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. వారికి లభించే జీతభత్యాలతో సంబంధం లేదు.

3) ఒక్కోసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో వారు సంపన్న శ్రేణి కిందకు వస్తారా? లేదా? అనేది విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ వారి తొలి ఉద్యోగ నియామకపు స్థాయిని బట్టి క్రీమిలేయర్‌ కిందకు రానివారు వారికున్న వ్యవసాయ భూపరిమితిని బట్టి సంపన్న శ్రేణి పరిధిలోకి రావచ్చు.

4) జీతభత్యాలు, వ్యవసాయం ద్వారా చ్చే ఆదాయం కాకుండా ఇతర సేవలు, వ్యాపారం లేదా వాణిజ్యం వంటి ఇతర రంగాల నుంచి ఆదాయాన్ని పొందుతున్నట్టయితే ఇతర రంగాల ద్వారా పొందే ఆదాయం క్రిమిలేయర్ పరిగణనకు ఉండవలసిన ఆదాయాన్ని మించి ఉంటే అప్పుడే వారి పిల్లలను సంపన్న శ్రేణిగా పరి పరిగణిస్తారు.

5) వివిధ సేవా వృత్తుల ద్వారా, వ్యాపార, వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం పొందేవారికి మాత్రమే ఆదాయ పరిమితి వర్తింపజేసి, క్రీమిలేయర్ పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయించాల్సి ఉంటుంది.

6) కొందరు ఉద్యోగులు కొంత వ్యవసాయ భూమితోపాటు ఇతర రంగాల నుంచీ ఆదాయాన్ని పొందుతున్నట్టయితే వారికి ఇతర రంగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి మాత్రమే వారి క్రీమిలేయర్ స్టేటస్‌ను నిర్ణయించాలి. అంతేకానీ, వేర్వేరు రంగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలిపి చూపి క్రీమిలేయర్ స్టేటన్‌ను నిర్ణయించరు.

7) కొందరు భూపరిమితి చట్టం ప్రకారం వుండవలసిన భూమిలో 85శాతం కన్నా తక్కువ భూమి ఉన్నట్టయితే.. ఇతర రంగాల ద్వారా లభించే ఆదాయం ఆదాయ పరిమితి కన్నా తక్కువగా ఉన్నందువల్ల క్రీమిలేయర్‌ కిందకు రారు. కానీ.. వారికి పట్టణాలలో ఉన్న సంపదనుబట్టి వారు సంపన్న శ్రేణి పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఉద్యోగులకూ వర్తిస్తుంది.

8) ఒక వ్యక్తి క్రీమిలేయర్ స్టేటస్‌ను అతని తల్లిదండ్రుల స్థాయిని బట్టి మాత్రమే నిర్ణయించాలి. అంటే.. ఎవరైనా గ్రూప్ -1 స్థాయి ఉద్యోగానికి ఎంపికై, మళ్ళీ గ్రూప్ -1 స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగానికి గ్రూప్-1 పరీక్షలకు, లేదా, సివిల్ సర్వీస్‌ పరీక్షలకు ప్రయత్నం చేస్తే.. అతని స్టేటస్‌ను బట్టి అతన్ని క్రీమిలేయర్‌గా పరిగణించరాదు. మహిళల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్‌ మేరకు క్రీమిలేయర్ స్టేటస్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది కానీ.. ఆమె భర్త స్టేటస్‌ను బట్టికాదు.

– వెంకటకిషన్ ఇట్యాల

తహసీల్దార్‌

9908198484