యూకే, సౌదీని మించి మనవద్దే పసిడి నిల్వలు.. టాప్ టెన్‌లో చోటు
అధిక మొత్తంలో బంగారు నిల్వలు (Gold Reserves) కలిగిన తొలి దేశాలలో భారత్ (India) చోటు దక్కించుకుంది.

అధిక మొత్తంలో బంగారు నిల్వలు (Gold Reserves) కలిగిన తొలి దేశాలలో భారత్ (India) చోటు దక్కించుకుంది. ప్రపంచ పసిడి సమాఖ్య (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం.. బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో 9వ స్థానంలో భారత్ నిలబడింది. ప్రస్తుతం భారత్ వద్ద రూ. 3,59,208 కోట్ల (48,157 మిలియన్ డాలర్ల) విలువైన 800.78 టన్నుల బంగారం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. తద్వారా ధనిక దేశాలైన సౌదీ అరేబియా, యూకే వంటి దేశాలను వెనక్కి నెట్టిందని పేర్కొంది. మరోవైపు ఈ జాబితా తన మొదటి స్థానాన్ని అగ్రరాజ్యం అమెరికా మరోసారి నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 489,133 మిలియన్ డాలర్ల విలువైన 3,352 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. ఆతర్వాత రెండు, మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టినందు రష్యా తమ దేశాల్లో దాచుకున్న పసిడి నిల్వలను పశ్చిమ దేశాలు దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఆ నిల్వలను విడుదల చేయించుకునేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అందులోని బంగారాన్ని వివిధ మార్గాల్లో విక్రయించి.. పర్యావరణ మార్పులపై పోరాటంలో భాగంగా వర్ధమాన దేశాలకు ఆర్థిక సాయం చేస్తోంది. మరోవైపు మన పొరుగు దేశమైన చైనాలో 2,191.53 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే దేశాలన్నీ ఎందుకు పసిడి నిల్వలను అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తాయన్న అనుమానం రాక మానదు. దేశ కరెన్సీలో భారీ హెచ్చుతగ్గులు రాకుండా మార్కెట్‌ను సుస్థిరంగా ఉంచడానికి బంగారం నిల్వలు అమితంగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ప్రభుత్వ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకునేందుకు కూడా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తాయి.
ప్రపంచాన్ని నడిపించే అమెరికన్ డాలర్ విలువకు బంగారానికి కూడా గట్టి సంబంధం ఉంటుంది. ఈ రెండింటి విలువ విలోమానుపాతంలో ఉంటూ మార్కెట్‌ను శాసిస్తాయి. అంటే డాలర్ విలువ పడిపోయిన సందర్భంలో బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ఈ పరిస్థితుల్లో వివిధ దేశాల బ్యాంకులు తమ బంగారాన్ని అత్యంత జాగ్రత్తతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టకుండా కాపాడుకుంటాయి. ఏదైనా రెండు దేశాల మధ్య వాణిజ్యలోటు విపరీతంగా ఉన్న సమయంలోనూ వివిధ సర్దుబాట్లకు బంగారాన్ని ఉపయోగిస్తారు. బంగారాన్ని వివిధ ప్రపంచసంస్థల వద్ద తనఖా పెట్టి అప్పు తెచ్చుకున్న దేశ ప్రభుత్వాలూ ఉన్నాయి.