UNO లో అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధ కూటమి పరాజయం

కాల్పుల విరమణతో సహా తక్షణమే గాజాకు సాయం అందించాలన్న తీర్మానానికి 120 దేశాల అనుకూల ఓటింగ్!
వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ సహా చిన్నా చితకా 14 దేశాలు
ABSTAIN చేసిన 44 దేశాల జాబితాలో UK, ఆస్ట్రేలియా, జపాన్, ఇటలీలతో ఇండియా
బట్టబయలైన ఇండియా పాత్ర
కెనడా ప్రతిపాదిత సవరణకు తిరస్కారం
నాజీ టెర్రరిస్టులకు అంతర్జాతీయ సమాజం కొమ్ము కాసిందంటూ ఇజ్రాయెల్ వ్యాఖ్యానం
నెత్తురోడే గాజాకి UNO తక్షణ నైతిక ఓదార్పు
ఐక్య రాజ్య సమితి ప్రత్యేక సాధారణ సభ (ఉంగా) ముగిసింది. కాల్పుల విరమణతో సహా గాజాకు మానవతా సాయం చేయడానికి జోర్డాన్ ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతుగా 120 దేశాలు ఓటింగ్ చేశాయి. గాజాపై యుద్ధం కొనసాగలనే ఇజ్రాయెల్ అమెరికా యుద్ధోన్మాద కూటమి చిత్తుగా ఓడింది. అది కనాకష్టంగా కేవలం 14 ఓట్లు పొందింది. 193 UNO సభ్య దేశాల్లో ఈ సంఖ్య 7 శాతమే. ఆ 14 దేశాల్లో కూడా అమెరికా, ఇజ్రాయెల్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ దేశాలు లేవు. 75 ఏళ్ల ప్రపంచ పోలీసు అమెరికాకి ఘోర ఓటమి ఎదురైనది. తుదకు G-7 కూటమి సభ్య దేశాల్ని కూడా అమెరికా తన వెంట నిలబెట్టుకోలేక పోవడం పరాభవమే.
అనుకూలంగా 120 దేశాలు ఓట్ చేశాయి. వ్యతిరేకంగా 14 దేశాలు ఓట్ చేశాయి. 45 దేశాలు ABSTAIN చేశాయి.
ఐదు UNO శాశ్వత సభ్యత్వదేశాల్లో ఒకేఒక్క అమెరికా తప్ప ఏ దేశం కూడా యుద్ద అనుకూల వైఖరిని తీసుకోలేదు.
G-7 కూటమిలోని ఏడు దేశాల్లో ఒకేఒక్క అమెరికా తప్ప మిగిలిన ఏ ఒక్క దేశం యుద్ధ అనుకూల వైఖరిని తీసుకోలేదు.
పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల కూటమికి నేడు అమెరికా నాయకత్వం వహిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరింత గట్టిపడింది. వాటి నుండి కూడా అమెరికా ఈసారి బాగా ఒంటరైపోయింది.
G-7 కూటమి సభ్య దేశాల్లో ఒక్క అమెరికా యుద్ధ అనుకూల వైఖరి తీసుకుంటే ఒక్క ఫ్రాన్స్ యుద్ధ వ్యతిరేక వైఖరి తీసుకుంది. మిగిలిన ఐదు దేశాలు Abstain వైఖరి తీసుకున్నాయి.
ఆకస్ కూటమి, క్వాడ్ కూటమి నుండి కూడా అమెరికా ఒంటరైపోవడం గమనార్హం!
గాజాపై ఇజ్రాయెల్ చేసే అధర్మ యుద్ధం పట్ల అంతర్జాతీయ సమాజం స్థూలంగా హేతుబద్ధతతో స్పందించింది. నగ్నంగా యుద్ధోన్మాద కూటమిని బలపరిచిన దేశాలు 14కి తగ్గడం శుభ పరిణామం.
హమాస్ ని టెర్రరిస్టు సంస్థగా తీర్మానంలో చేర్చాలని కెనడా సవరణ ప్రతిపాదించింది. భారత్ కూడా బలపరిచిన కెనడా తీర్మానానికి తగిన ఓట్లు రానందున వీగిపోయింది. తద్వారా అంతర్జాతీయ సమాజం స్థూలంగా విజ్ఞతని ప్రదర్శించింది.
ప్రపంచంలో 21 దేశాలు అరబ్ లీగ్ లో ఉన్నాయి. వీటితో కలిపి ఇస్లామిక్ దేశాల సహకార సంస్థలో 56 దేశాలున్నాయి. ఈ 56 దేశాల్లో ఒక్క ఇరాక్ మాత్రమే Abstain చేసిన దేశాల్లో చేరింది. మిగిలిన అన్ని దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్ చేశాయి. (దురాక్రమణకి గురైన ఇరాక్ ప్రభుత్వం ఎలా వున్నా, ఇరాక్ ప్రజలు లక్షల్లో పాలస్తీనా పక్షాన రోడ్ల పైకి రావడం గమనార్హం)
ఒకప్పుడు సార్క్ గా పిలిచిన దక్షిణాసియా దేశాలలో ఒక్క ఇండియా ఒంటరై పోయింది. మన ఇరుగుపొరుగు దేశాలన్నీ యుద్దాన్ని వ్యతిరేకించే తీర్మానాన్ని బలపరచడం విశేషం! పాకిస్థాన్, బంగ్లా, మాల్దీవులు ముస్లిం దేశాలు అనుకుందాం. నేపాల్, భూటాన్, శ్రీలంక సైతం యుద్ధ విరమణ జరిగి గాజా ప్రజలకు సాయాన్ని అందించాలని కోరాయి. నెత్తురోడుతున్న గాజా పక్షాన నిలిచాయి. దక్షిణాసియాలో భారత్ మాత్రమే ఇజ్రాయెల్ పట్ల తన స్వామిభక్తిని పరోక్ష రూపంలో చాటుకుంది. యుద్దాన్ని వ్యతిరేకించే వైఖరిని తీసుకోలేదు. అదే సమయంలో ఇజ్రాయెల్ యుద్దాన్ని అతి నగ్నంగా బలపరచకుండా జాగ్రత్త పడింది. Abstain ద్వారా ఇజ్రాయెల్ పట్ల Back door support ని భారత్ చాటుకుంది.
పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల కూటమి నుండి జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇటలీ వంటి దేశాలు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ కూటమికి ఓట్లు వేయకుండా Abstain చేయడం సానుకూల పరిణామం. అలీన దేశాల కూటమికి నాయకత్వం వహించిన నేపథ్య చరిత్ర గల ఇండియా Abstain చేయడం ప్రతికూల పరిణామం.
ఉంగా తీర్మానం ఆమోదం పొందాక ఇజ్రాయెల్ ప్రతినిధి ప్రతిస్పందిస్తూ IT SHOWS, MEJORITY OF INTERNATIONAL COMMUNITY PREFERS TO SUPPORT “DEFFENCE OF NAZI TERRORISTS, INSTEAD OF ISRAEL” అని వ్యాఖ్యానించాడు.
ఇజ్రాయెల్ దృష్టిలో తన యుద్దాన్ని బలపరచని దేశాలన్నీ “హమాస్ నాజీ టెర్రరిస్టు” సంస్థకి మద్దతు ఇస్తున్నట్లే! ఇది 2001 లో ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధంలో తనతో చేతులు కలపని దేశాలన్నీ టెర్రరిస్టు ఆల్ ఖైదా మద్దతుదార్లని బుష్ చేసిన నింద వంటిదే!
హమాస్ ప్రతిఘటనా సంస్థగా ఎదగడానికి ఇజ్రాయెల్ టెర్రరిస్టు రాజ్య విధానమే ముఖ్యకారణం. మొదట హమాస్ స్థానం గాజాకి పరిమితం. అది ఇప్పుడిప్పుడే పాలస్తీనా భూభాగాలు అన్నింటికి విస్తరిస్తోంది. ఇప్పుడు 120 దేశాల్ని హమాస్ మద్దతుదార్లుగా ప్రకటించి దాని స్థానాన్ని ఇజ్రాయెల్ ఇంకా విస్తరింపజేస్తోంది. తానే స్వయంగా టెర్రరిస్టు రాజ్యమై, తన టెర్రరిస్టు యుద్దాన్ని వ్యతిరేకించిన కారణంగా 120 ప్రపంచ దేశాల్ని నాజీ టెర్రరిస్టు మద్దతుదార్లుగా ముద్ర వేయడం మితిమీరిన ఇజ్రాయెల్ యుద్ధోన్మాద వైఖరికి నిదర్శనం. అది ప్రపంచవ్యాప్తంగా ఇంకా బట్టబయలు కావడానికి దారితీస్తుంది. అది తన పతనానికి ముందు చేసే వికృత కూతలివి.
ఈ తీర్మానం ఏ మేరకు కార్యరూపం దరిస్తుందో ఇప్పుటికిప్పుడే చెప్పలేని విషయమే. అంతర్జాతీయ సమాజం పంపిన వందల ట్రక్కులు రఫా బోర్డర్ వద్ద క్యూలో నిలిచి ఉన్నాయి. బైడెన్ దయతలిచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిమిత ట్రక్కుల్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది. ఆ పద్దతికి స్వస్తి చెప్పి ఇక అంతర్జాతీయ సమాజం అధికారికంగా UNO ద్వారా చొరవ తీసుకునే అవకాశం లభించింది. ఏం జరుగుతుందో చూద్దాం.
రేపు ఏదైనా జరగానీ, ఈరోజు ఒక మంచి పని జరిగిందని చెప్పొచ్చు. పసికందులు, స్త్రీలు, రోగులు, వృద్ధులనే విచక్షణ కూడా లేకుండా 22 రోజులుగా కొనసాగే యుద్దాన్ని అంతర్జాతీయ సమాజం ఖండించడం సానుకూల పరిణామం. నెత్తుటి ధారల్లో తల్లడిల్లే గాజా బాధితులకు నైతిక, మానసిక ఉపశమనం ఇస్తుంది. UNO ద్వారా వాస్తవ సాయం ఎన్ని రోజులకి అందుతుందో గానీ, త్వరలో తమకు అందుతుందని ఆశించే అవకాశం లభించింది. ఆ ఆశ కూడా లేకపోతే నేడే మరణించే స్థితిలో ఉన్న అన్నార్తులు, క్షతగాత్రులు, వ్యాధిగ్రస్తులు ఇంకో ఒకట్రెండు రోజులు బ్రతికే అవకాశాన్ని ఈ ఆశ కల్పిస్తుంది. అట్టి ఆశను తాజా UNO తీర్మానం కల్పించిందని చెప్పొచ్చు.
GMT ప్రకారం గాజా మనకు రెండున్నర గంటల దూరంలో ఉంది. కానీ 22 రోజులుగా గాజా మన ఆత్మబంధువైనది. గాజా కోసం మనం బాధ పడుతున్నాం. కన్నీళ్లు కారుస్తున్నాం. గాజా పసికందుల రక్తసిక్త చిద్ర దృశ్యాలు మనలను నిద్ర పట్టనివ్వడం లేదు. ఔను, UNO ఉపశమన వార్తని ఆస్వాదిద్దాం. ముఖ్యంగా యుద్ధోన్మాద కూటమిని ఈరోజు ముక్తకంఠంతో వ్యతిరేకించిన ప్రపంచ దేశాల ప్రతిస్పందనని ఆహ్వానిద్దాం. ఇది ఒక శుభదినంగా భావించి పరస్పరం శుభోదయం చెప్పుకుందాం.
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
28-10-2023