మోదీని తెలివైన ఈవెంట్ మేనేజర్‌ అన్న అద్వానీ!

మోదీని కాపాడి అద్వానీయే ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు.

మోదీని తెలివైన ఈవెంట్ మేనేజర్‌ అన్న అద్వానీ!
  • కాపాడిన అద్వానీయే మోదీ నిజస్వభావాన్ని చాటారు
  • ఎక్స్‌లో కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు
  • ఓట్లు చెదిరిపోకుండా చూసుకునేందుకే
  • సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌

న్యూఢిల్లీ : అద్వానీకి భారత రత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా తనకు రెండు విషయాలు గుర్తుకొస్తున్నాయని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఒక అంశం.. 2002లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని అద్వానీ కాపాడటం. అప్పటి ప్రధాని వాజపేయి మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని భావించారు. రాజధర్మాన్ని పాటించాలంటూ మోదీకి వాజపేయి గుర్తు చేశారు. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో మోదీ వెంట నిలబడినది అద్వానీయే’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ‘2014కు ఫాస్ట్‌ఫార్వర్డ్‌ చేస్తే.. 2014 ఏప్రిల్‌ 5న మోదీ గాంధీనగర్‌ నుంచి నామినేషన్‌ వేయడానికి వెళ్లేటప్పుడు అద్వానీ కొన్ని బంగారు తునకల్లాంటి మాటలు చెప్పారు. మోదీ తన శిష్యుడు కాదని, కానీ తెలివైన ఈవెంట్‌ మేనేజర్‌ అని. ఈ మాటలు నేను చెప్పడం లేదు. అద్వానీయే మోదీ గురించి చెప్పారు. వారిద్దరినీ చూసినప్పుడు నాకు ఈ రెండు సందర్భాలు గుర్తుకు వచ్చాయి’ అని ఆయన పేర్కొన్నారు. ‘2002లో మోదీని అద్వానీ కాపాడారు. 2014లో ఆయన నిజస్వభావాన్ని దేశం ముందు ఉంచారు’ అని తెలిపారు. అద్వానీకి భారత రత్న పురస్కారం ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. మరోవైపు ఆయనకు అవార్డు ఇవ్వడంలో చాలా ఆలస్యమైందని కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ వ్యాఖ్యానించారు.

ఓట్ల కోసమే :అఖిలేశ్‌

బీజీపీ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా చూసుకునేందుకే అద్వానీకి భారత రత్న అవార్డును మోదీ ప్రకటించారని సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. అంతేకానీ అద్వానీపై గౌరవంతో కాదని వ్యాఖ్యానించారు.