Javed Akhtar | యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగాపై రచయిత జావెద్‌ అక్తర్‌ విమర్శలు..! సిగ్గుండాలి అంటూ ఘాటుగానే స్పందించిన బాలీవుడ్‌ రచయిత..!

Javed Akhtar | యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగాపై రచయిత జావెద్‌ అక్తర్‌ విమర్శలు..! సిగ్గుండాలి అంటూ ఘాటుగానే స్పందించిన బాలీవుడ్‌ రచయిత..!

Javed Akhtar | సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు కాసుల వర్షం కురువగా.. గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. కానీ, డైలాగులు, హింసాత్మక సన్నివేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శకుల జాబితాల్లో ప్రముఖ గీత రచయిత, కవి జావేద్‌ అక్తర్‌ సైతం ఉన్నారు. ఈ సినిమా విజయాన్ని ఆయన ‘ప్రమాదకరం’గా అభివర్ణించారు. దీనిపై సందీప్‌ రెడ్డి వంగా సైతం ప్రతి విమర్శలు చేశారు.

తాజాగా తనపై దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై జావేద్‌ అక్తర్‌ మరోసారి ఘాటు వ్యాఖ్యలే చేశారు. సందీప్‌రెడ్డి నా 53 సంవత్సరాల కెరీర్‌లో నేను చేసిన ఒక్క తప్పునూ వెతకలేకపోయావా? సిగ్గుండాలి అంటూ ఘాటుగా బాలీవుడ్‌ రచయిత వ్యాఖ్యానించారు. యానిమల్‌ మూవీ తీసినందుకు తాను దర్శకుడిని ఏం అనడం లేదని.. రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కన్న రచయిత.. తన ఆందోళన ప్రేక్షకుల గురించి మాత్రమేనన్నారు. తాను ఆ సినిమాను చూడలేదని.. చూసిన వాళ్లు చెప్పిన దాన్ని బట్టే కామెంట్స్‌ చేసినట్లు చెప్పారు.

యానిమల్ మూవీలో మహిళలను కించ పరిచారని జావెద్‌ అక్తర్‌ చేసిన కామెంట్లపై సందీప్‌ వంగా.. ఆయన కొడుకు ఫర్హాన్‌ అక్తర్‌ రూపొందించిన ‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌ కనిపించలేదా? అంటూ స్పందించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రచయిత స్పందిస్తూ నా 53 సంవత్సరాల కెరీర్‌లో ఒక్క తప్పును పట్టుకోలేకపోయావా? నా కొడుకు దగ్గరికి వెళ్లావా? అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

అతడు (సందీప్‌ వంగా) స్పందించడం నాకు గౌరవంగా అనిపించిందని.. 53 సంవత్సరాల కెరీర్‌లో ఒక్క సినిమా, స్క్రిప్ట్‌, సీన్‌, డైలాగ్‌, పాటలో తప్పును కనిపెట్టలేకపోయాడని.. నా కొడుకు కార్యాలయం నిర్మించిన ఓ టీవీ సీరియల్‌ను పట్టుకున్నాడన్నారు. అందులో తన కొడుకు ఫర్హాన్‌ నటించలేదని.. డైరెక్ట్‌ చేయలేదన్నారు. కంపెనీ ఎక్సెల్ మీడియా మాత్రమే ప్రొడ్యూస్ చేసిందన్నారు. సందీప్‌ దాన్నే పట్టుకున్నాడు గానీ.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క తప్పునూ వెతకలేకపోయావా? సిగ్గు చేటు అంటూ సీనియర్‌ రచయిత ఘాటుగా స్పందించారు.