లో స్కోరింగ్ గేమ్‌లో భార‌త్ అద్భుత విజ‌యం..చెత్త రికార్డ్ న‌మోదు చేసిన కోహ్లీ

లో స్కోరింగ్ గేమ్‌లో భార‌త్ అద్భుత విజ‌యం..చెత్త రికార్డ్ న‌మోదు చేసిన కోహ్లీ

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ఆస‌క్తిక‌ర మ్యాచ్‌లు చోటు చేసుకుంటున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు చ‌ప్ప‌గా సాగిన ఈ టోర్నీ ఇప్పుడు రంజుగా మారింది. నువ్వా నేనా అన్నట్టు పోటా పోటీగా ఫైటింగ్ జ‌రుగుతుంది. ఇక ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు జైత్ర యాత్ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఓడ‌ని భార‌త జ‌ట్టు తాజాగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోను అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 229 ప‌రుగులు చేసిన భార‌త్ ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఇంగ్లండ్‌ని 34.5 ఓవ‌ర్ల‌లో 129 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. ఈ క్ర‌మంలో భార‌త్ వంద ప‌రుగుల తేడాతో మంచి విజ‌యం సాధించింది.

అయితే ఇప్ప‌టి వ‌రకు 6 మ్యాచులు ఆడిన ఇంగ్లండ్ జ‌ట్టు ఐదు మ్యాచుల్లో ఓట‌మి పాల‌వ‌డంతో అధికారికంగా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఇక వ‌రుస‌గా ఆరు విజ‌యాలు అందుకున్న భారత జట్టుకి దాదాపు సెమీ ఫైనల్ కి అర్హత సాధించింది..అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భార‌త జ‌ట్టుకి ప‌రుగులు రాబ‌ట్ట‌డం చాలా క‌ష్టంగా మారింది. రోహిత్ శర్మ 87, సూర్యకుమార్ యాదవ్ 49, కెఎల్ రాహుల్ 39 పరుగులు చేయ‌డంతో భార‌త జ‌ట్టు ..229 ప‌రుగులు సాధించింది. అయితే 230 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ బౌల్డ్ కాగా, రూట్ తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయి పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు.

ఇక‌ బెన్ స్టోక్స్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేయ‌గా, జానీ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొయిన్ ఆలీ, లియామ్ లివింగ్‌స్టోన్ కలిసి ఆరో వికెట్‌కి మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పాల‌ని చూసిన జ‌డేజా వారి బాగ‌స్వామ్యానికి తెర‌దించాడు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిల‌వ‌లేక‌పోవ‌డంతో ఇంగ్లండ్ జ‌ట్టు 129 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ డకౌట్ అయిన విష‌యం తెలిసిందే. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్రీజు ధాటి ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీ.. స్టోక్స్ కి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 9 బంతులు ఆడిన కోహ్లీ ఖాతా తెరవకుండా ఔట్ కావ‌డంతో, ఆయ‌న ఖాతాలో చెత్త రికార్డ్ నమోదు అయింది. ఇప్పటి వరకూ వన్డే, టీ20 ప్రపంచకప్‍లలో కలిపి 56 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లి.. తొలిసారిగా డకౌట్‌గా వెనుదిరగ‌డం అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది.