అభిమానుల కోసం ఉచితంగా కళ్యాణ మండపం.. ఇందులో ఎవరైన పెళ్లి చేసుకోవచ్చన్న లారెన్స్

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతి తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగాడు లారెన్స్. ఆయనని ఓ సెలబ్రిటీగా కంటే మంచి మనసున్న మనిషిగా జనాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. లారెన్స్ ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సందడి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రముఖి 2 సినిమాతో ఆడియన్స్‌ని అలరించారు లారెన్స్. గతంలో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సిక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. ఇక రీసెంట్‌గా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమాలో నటించారు.
లారెన్స్, ఎస్జే. సూర్య ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. డిసెంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగాఈ మూవీ స్ట్రీమింగ్ కానుండగా, ఈ నేపథ్యంలో చెన్నైలో సక్సెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం కీలకనిర్ణయం తీసుకున్నారు లారెన్స్. జిగర్ తండా సినిమా మంచి విజయాన్ని అందించిందని.. ఇందులో అసలైన హీరో మాత్రం కార్తీక్ సుబ్బరాజు అంటూ అతనిపై ప్రశంసలు కురిపించారు. అభిమానుల ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనని.. వారందరూ తన కుటుంబసభ్యులే అని లారెన్స్ కొనియాడారు. ఇక సినిమా రిలీజైన ప్రతిసారి కూడా తాను ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటాను అని చెప్పిన లారెన్స్ ఈ సారి తన అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని నిర్మించబోతున్నట్టు తెలియజేశాడు.
ఆ కళ్యాణ మండపంలో తన ప్రతి అభిమాని కూడా ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు అని లారెన్స్ అన్నారు. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇటీవల నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇస్తూ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి ఎక్కడ అని అడిగితే ఇంట్లోనే చేసుకుంటున్నాను. డబ్బులు అంతగా లేని కారణంగా ఇంట్లోనే చేసుకుంటున్నాను అని అన్నాడు. పెళ్లి సమయంలో కూడా అతని ముఖంలో ఆనందం లేకపోవడం నన్ను బాధించింది. అందుకే మా అమ్మ పేరుతో కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకుంటున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు అంటూ లారెన్స్ తన ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగిపోయే ఆఫర్ ఇచ్చాడు.