మ‌రోసారి భంగ‌ప‌డ్డ ఆర్సీబీ.. సులువుగా గెలిచిన ముంబై ఇండియ‌న్స్

మ‌రోసారి భంగ‌ప‌డ్డ ఆర్సీబీ.. సులువుగా గెలిచిన ముంబై ఇండియ‌న్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం జరిగిన 9వ మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ల‌ప‌డ్డాయి. రెండు గ‌ట్టి జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన బిగ్ ఫైట్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ ముంబై జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకుండానే బ‌రిలోకి దిగి మంచి విజ‌యాన్ని త‌మ ఖాతాలో వేసుకుంది. హ‌ర్మ‌న్ ప్రీత్ గైర్హాజ‌రుతో నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్సీ ప‌గ్గాలు అందుకోగా ఆమె నాయ‌క‌త్వంలో మంచి విజ‌యాన్ని అందుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.గ‌త మ్యాచ్‌లో ఓడిన ముంబై ఈ మ్యాచ్‌లో పట్టుద‌ల‌తో ఆడి ఆర్సీబీని మ‌ట్టి క‌రిపించి విజ‌యం సాధించింది.

బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్ర‌మే చేసింది. ఎలీస్ పెర్రీ (44; 38 బంతుల్లో) మాత్ర‌మే ఎక్కువ స్కోరు చేశారు. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో ఆర్సీబీ క‌నీసం 150 ప‌రుగుల మార్కు కూడా చేరుకోలేక‌పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన (9) ఈ మ్యాచ్‌లో త్వరగానే ఔటైంది. ఇక ముంబై బౌలర్లలో తాత్కాలిక కెప్టెన్ నాట్ స్కీవెర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీసి ఆర్సీబీని క‌ట్ట‌డి చేశారు. ఇక 132 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై జ‌ట్టు కేవ‌లం 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు యస్తికా భాటియా (31; 15 బంతుల్లో), హేలీ మాథ్యూస్ (26; 21 బంతుల్లో) ఆది నుండి స్పీడ్‌గా ఆడ‌డంతో తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలోనే 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

యస్తికా ఔటైన తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన నాట్ స్కీవర్ (27; 25 బంతుల్లో) వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడింది. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌కు దిగిన అమెలియా కెర్ (40*; 24 బంతుల్లో) వీర విహారం చేసింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ సులువుగా గెలిచింది. అయితే ఆర్సీబీ జ‌ట్టు తమ ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలు సాధిస్తే… ఛేదనలో ముంబై 22 బౌండరీలు బాదడం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. బెంగళూరులో బౌలర్లలో సోఫీ డివైన్, వారెహమ్, శ్రేయాంక పాటిల్‍కు చెరో వికెట్ దక్కింది. ఇక వరుసగా రెండో మ్యాచ్ ఓడిన బెంగళూరు ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి పడిపోయింది.