Breaking: నందమూరి తారకరత్న కన్నుమూత
Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న(39) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో గత 23 రోజుల నుంచి చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తారకరత్న మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించిన సంగతి […]

Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న(39) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో గత 23 రోజుల నుంచి చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తారకరత్న మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్దిసేపు నడిచిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలి పోయారు. స్పృహ తప్పి పడిపోయిన తారకరత్నను చికిత్స నిమిత్తం హుటాహుటినా కుప్పంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనను ప్రాణాలతో కాపాడేందుకు నారాయణ హృదయాలయ వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామ రావు మనువడు, నందమూరి మోహన కృష్ణ తనయుడే తారకరత్న. 1983, జనవరి 8వ తేదీన తారకరత్న జన్మించారు. 2002లో తొలిసారిగా టాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేశారు తారకరత్న. ఆయన తొలి చిత్రం ఒకటో నంబర్ కుర్రాడు. కాగా చివరి చిత్రం S5 నో ఎగ్జిట్.
20 ఏండ్ల వయసులోనే ఇండస్ట్రీకి.. వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న
20 ఏండ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన తారకరత్న.. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకుని వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలు పెట్టారు. కేవలం ముహూర్తంతోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పుడు మొదలుపెట్టిన సినిమాలలోనే ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.
హీరోగా సక్సెస్ కాలేక.. రాజకీయాల్లోకి..
9 సినిమాల హీరో అనే ముద్ర తారకరత్నపై ఉన్నప్పటికీ.. నటుడిగా విజయం సాధించలేకపోయారు. సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో.. ఆయన రాజకీయాలపై దృష్టి సారించారు. అమరావతి వంటి కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ, మెప్పించలేకపోయాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా తారకరత్న ఇటీవలే ప్రకటించారు. అయితే.. తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ ఏ స్థానం నుంచి కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారినప్పటికీ, ఆయన ప్రాణాలు కోల్పోవడం విషాదంతమైంది.