సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం
సూర్యాపేట మున్సిపాల్టీ బీఆరెస్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు.

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : సూర్యాపేట మున్సిపాల్టీ బీఆరెస్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. సూర్యాపేట కలెక్టర్ వెంకట్రావుకు అవిశ్వాసం నోటీస్ అందించారు. మున్సిపాల్టీలో మొత్తం 48మంది కౌన్సిలర్లు ఉండగా, వారిలో 36మంది అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు.అయితే నాటి విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జి. జగదీష్ రెడ్డి జనరల్ మహిళా స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశం కల్పిస్తూ పెరుమాళ్ల అన్నపూర్ణను చైర్ పర్సన్‌గా ఎంపిక చేశారు.
నాటి నుంచి అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు అంతా అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అయితే శాసనసభ ఎన్నికలు పూర్తి కావడం, బీఆరెస్ ప్రభుత్వం పడి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా కలెక్టర్‌కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. కొత్తగా చైర్ పర్సన్ పదవి కోసం కొండపల్లి నిఖిల, కవితాబాలుగౌడ్, కక్కిరేణి శ్రీనివాస్‌లు చైర్మన్ పదవి రేసులో ఉన్నారు.