PM Modi | సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందే భారత్‌కు నేడు మోదీ గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.85వేలకోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం..

PM Modi | సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందే భారత్‌కు నేడు మోదీ గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.85వేలకోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం..

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ నగరాల మధ్య కొత్తగా 10 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. దాంతో పాటు దేశవ్యాప్తంగా రూ.85వేలకోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్‌ రైళ్లలో సికింద్రాబాద్‌-విశాఖపట్నం రైలు సైతం ఉన్నది. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య మూడో వందే భారత్‌ రైలు కాగా.. ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య సెమీ హైస్పీడ్‌ రైలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. కొత్త రైలు బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. 20707 నంబరు గల రైలు ఉదయం 5.05గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. 20708 రైలు విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు హైదరాబాద్‌ చేరుకుతుంది.ఈ రైలు ఏపీ, తెలంగాణ మధ్య మరింత కనెక్టివిటీని పెంచుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. 55 వన్‌ నేషన్‌-వన్‌ ప్రొడక్ట్‌, మూడు పీఎం గతశక్తి కార్గో టర్మినల్స్‌, నాలుగు గూడ్స్‌ షెడ్స్‌, ఒక పీఎం జన్‌ ఔషధి కేంద్రం, రెండు రైల్‌ కోచ్‌ రెస్టారెంట్లు ప్రారంభించనున్నారు. కాజీపేట్- బల్లార్షా, కాజీపేట్- విజయవాడ మధ్యన నిర్మిస్తున్న మూడో లైన్‌లో రెండు మార్గాల్లోని రెండు సెక్షన్లలో పూర్తయిన ట్రాక్‌లను జాతికి అంకితం చేయనున్నారు. అలాగే అసన్సోల్‌, హతియా, తిరుపతి-కొల్లం స్టేషన్ల మధ్య రెండు కొత్త ప్యాసింజర్‌ రైళ్లను సైతం ప్రధాని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ల అంకితం, ట్రాక్‌ల డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్, రైల్వే గూడ్స్ షెడ్ అభివృద్ధి, వర్క్‌షాప్, లోకో షెడ్, పిట్ లైన్, కోచింగ్ డిపో తదితర అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు ఆధునిక, బలమైన రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మించడంతో పాటు కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా ఆర్థికాభివృద్ధిని పెంచి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని రైల్వేశాఖ వర్గాలు పేర్కొన్నాయి.