గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే.. ఇదీ పోలీసుల సూచన

గ్రామంలో ఎవరైనా కొత్తవారు లేదా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెన్నూరు సీఐ కోరారు.

గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే.. ఇదీ పోలీసుల సూచన

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్:

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసు వారికి సమాచారం అందించాలని, గ్రామాల్లో కొత్తవారికి ఆశ్రయం ఇవ్వొద్దని చెన్నూరు సీఐ విద్యా సాగర్ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా, మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లంపల్లిలో జైపూర్ ఏసీపీ మోహన్ పర్యవేక్షణ లో చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది 40 మందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లలో సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగా లేని 18 బైక్ లు, ఆటో సీజ్ చేశారు.


సంఘ విద్రోహశక్తులకు యువకులు సహకరించవద్దని కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమంలో భాగంగా కల్లంపల్లి ఫెర్రి పాయింట్ తనిఖీ, ఏరియా డామినేషన్ నిర్వహించి కల్లంపల్లిలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల ధ్యేయమన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.


ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, ఓటీపీ వివరా లను చెప్పవద్దన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వొద్దన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు ఆకర్షితులు కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, ఆర్ఎస్ ఐ వెంకట్, స్పెషల్ పార్టీ, టీఎస్ఎస్పీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.