Rajasthan | ఎన్నిక‌ల తంటాలు.. మ‌ద్ద‌తుదారుల బూట్లు పాలిష్ చేసిన ఎమ్మెల్యే

Rajasthan | ఎన్నిక‌ల తంటాలు.. మ‌ద్ద‌తుదారుల బూట్లు పాలిష్ చేసిన ఎమ్మెల్యే

Rajasthan | ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయంటే చాలు.. ప్ర‌తి వీధిలో, ప్ర‌తి గ్రామంలో రాజ‌కీయ నాయ‌కులు వాలిపోతుంటారు. ఎన్నిక‌ల్లో గెలుపు దిశ‌గా అడుగులేస్తుంటారు. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఓ ఎమ్మెల్యే త‌న మ‌ద్ద‌తుదారుల బూట్లు పాలిష్ చేసి.. వారిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు.. ఓ వృద్ధుడి బూట్ల‌ను త‌న నుదుటిన పెట్టుకున్నారు స‌ద‌రు ఎమ్మెల్యే.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌స్థాన్‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. మ‌హ్వా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హుడ్లా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం మ‌హ్వా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఓ చెప్పుల దుకాణం వ‌ద్ద ఆయ‌న వంద‌ల మంది బూట్ల‌ను పాలిష్ చేశారు. ఓ వృద్ధుడి బూట్లు ధ‌రించిన త‌ర్వాత అత‌ని పాదాల‌ను తాకుతూ, ఆ బూట్ల‌ను త‌న నుదుటి వ‌ద్ద పెట్టుకుని, ఆ పెద్దాయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు స‌ద‌రు ఎమ్మెల్యే.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల వివ‌క్ష‌ను నిర్మూలించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న మ‌ద్ద‌తుదారులే త‌న‌కు దేవుళ్లు అని పేర్కొన్నారు. సామాన్యుడి వైపే తాను నిల‌బ‌డుతాన‌ని చెప్పారు. నిరుపేద‌ల‌కు, కూలీల‌కు త‌న వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. వంద‌లాది మంది ద‌ళితుల షూ పాలిష్ చేసి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నాన‌ని చెప్పారు. మ‌హ్వాలో ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవిస్తున్నారు. కొంద‌రు నాయ‌కులు కుల రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారు.. ఇది స‌రికాద‌న్నారు ఎమ్మెల్యే. మ‌హ్వా నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశామ‌ని ఎమ్మెల్యే హుడ్లా స్ప‌ష్టం చేశారు. 2018 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత హుడ్లా చాలా మంది బూట్ల‌ను పాలిష్ చేసి వారి మ‌న‌సును గెలిచారు.