శివాలెత్తిన రోహిత్‌,గిల్‌.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా

శివాలెత్తిన రోహిత్‌,గిల్‌.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా

ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌- ఇండియా మధ్య ఐదో టెస్ట్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ ఆదిప‌త్యం క‌న‌బ‌రుస్తుంది. ఇంగ్లండ్‌ని 218 ప‌రుగులకి క‌ట్టిడి చేసిన భార‌త్ బ్యాటింగ్‌లో చెల‌రేగిపోతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ (103 ), శుభ్‌మన్ గిల్ (113) శతకాలతో కదం తొక్క‌డంతో టీమిండియా భారీ స్కోర్ దిశ‌గా సాగ‌తుంది. 135/1 ఓవర్‌నైట్ స్కోరు ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. రోహిత్, గిల్‌ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ‌డంతో ఇంగ్లండ్ బౌల‌ర్స్ తేలిపోయారు. అయితే ఇక లాభం లేద‌నుకొని ఏకంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రంగంలోకి దిగాడు.

దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి బౌలింగ్ చేయ‌గా, ఆయ‌న వేసిన తొలి బంతికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో)ను క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రీఎంట్రీలో ప‌దునైన బంతులు విసిరిన స్టోక్స్ మిగ‌తా బ్యాట్స్‌మెన్స్‌కి కూడా ఇబ్బంది పెట్టాడు. అయితే బంతి గమనాన్ని అంచనా వేయలేపోయిన రోహిత్ క్లీన్ బౌల్డ్ అయి నిరాశ‌గా మైదానాన్ని వీడాడు. అత‌ను ఔటైన తీరు కూడా ప్ర‌తి ఒక్కరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. కామెంటేట‌ర్ సంజయ్ మంజ్రేకర్ ఆ బంతిని మ్యాజికల్ బాల్‌గా అభివర్ణించాడు.

ఇక రోహిత్ ఔటైన కొద్ది సేప‌టికే గిల్ అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 150 బంతుల్లో 110 ప‌రుగులు చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కుదురుకున్నార‌నుకున్న ఇద్ద‌రు భారత బ్యాటర్లు స్వల్పవ్యవధిలోనే పెవిలియన్‌కు చేర‌డంతో త‌ర్వాత బ్యాట్స్‌మెన్స్ ఆడిచితూచి ఆడుతున్నారు. గిల్, రోహిత్ రెండో వికెట్‌కు 171 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో దేవదత్ పడిక్కల్ (34; 47 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (19; 34 బంతుల్లో) ఉన్నారు. 75 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. దీంతో భార‌త్‌కి 111 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్‌దీప్ యాదవ్ అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించ‌డంతో ఇంగ్లీష్ జ‌ట్టు త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయింది.