పాడుబడిన ఇంట్లో ఐదు అస్తిపంజరాలు! ఏం జరిగింది?
కర్ణాటకలోని ఒక ఇంట్లో ఐదు అస్తిపంజరాలు కనిపించడం సంచలనం రేపింది. మృతులంతా ఒకే కుటంబానికి చెందినవారుగా తెలుస్తున్నది.

కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో ఘటన
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
2019 జూలై నుంచి బయట కనిపించలేదు..
బెంగళూరు : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఒక ఇంట్లో ఐదు అస్తిపంజరాలు వెలుగు చూడటం సంచలనం రేపింది. మృతులంతా ఒకే కుటుంబానికి సంబంధించినవారని తెలుస్తున్నది. ఆ ఇంటికి లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నది. చుట్టుపక్కలవారితో ఆ ఇంట్లోవాళ్లు ఎప్పుడూ మాట్లాడేవాళ్లు కాదని స్థానికులు చెబుతున్నారు. మృతులకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండేవని బంధువులు పోలీసులకు తెలిపారు. ఈ ఐదుగురూ 2019 జూలై నుంచి బయట కనిపించలేదని అంటున్నారు. రెండు నెలల క్రితం ఆ ఇంటి మెయిన్ డోర్ పగిలి ఉండటాన్ని స్థానికులు గమనించారు. లోనికి వెళ్లి చూడగా లోపల కూడా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. దోపిడీ జరిగినట్టు కనిపించింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక గదిలో బెడ్‌పైన రెండు అస్తిపంజరాలు, నేలపై మరో రెండు అస్తిపంజరాలు గుర్తించారు. మరో అస్తిపంజరం వేరొక గదిలో పడి ఉన్నది. దీంతో ఆ ఇంటి వద్ద కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.. దావణగిరి నుంచి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణుల బృందాన్ని, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ బృందాలను రప్పించి, ఆధారాలు సేకరించారు. మృతుల్లో 80 ఏళ్ల వయస్కులైన భార్యాభర్తలు, వారి పెద్దకొడుకు, కుమార్తె, 57 ఏళ్ల మనుమడు అని స్థానికులు, బంధువుల కథనాలను బట్టి తెలుస్తున్నది. అయితే.. మృతులను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు.