తెలంగాణకు నేనే సీఎం.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల పోలింగ్ జరగనే లేదు.. ఫలితాలు వెల్లడి కాలేదు.. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ముఖ్యమంత్రి పోస్టు కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణకు నేనే సీఎం అంటే నేనే సీఎం అని ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించబోయేది పాలమూరు బిడ్డనే అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. పదవులు తన వద్దకే వస్తాయని, నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని జానారెడ్డి ప్రకటించుకున్నారు. రాబోయే కాలంలో తెలంగాణకు తప్పకుండా సీఎంను అవుతానని జగ్గారెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేరారు.
నిన్న నల్లగొండ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని తన మనసులో మాట చెప్పేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సోనియా తనకే సీఎం పోస్టును కట్టబెడుతారని తెలిపారు. తన కంటే సీనియర్లు ఎవరూ లేరని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.