బ్యాగ్‌లో డెడ్‌బాడీ.. వెలుగు చూసిందిలా

తన కుమారుడిని చంపిన బెంగళూరు స్టార్టప్‌ సీఈవో.. మృతదేహాన్ని బ్యాగులో పెట్టి, పైన వస్త్రాలు, ఆట వస్తువులు పేర్చి.. పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేసింది.

బ్యాగ్‌లో డెడ్‌బాడీ.. వెలుగు చూసిందిలా
  • డెడ్‌బాడీపై బొమ్మలు పేర్చిన సుచనా శేథ్‌
  • పోలీసులను ఏమార్చే ప్రయత్నం
  • బ్యాగ్‌ మొత్తం చూపాలనడంతో బయటపడిన శవం

గోవా: తన నాలుగేళ్ల కొడుకును చంపిన బెంగళూరు మహిళ సుచనసేథ్‌.. కొడుకు శవం బయటపడకుండా పెద్ద పన్నాగమే పన్నిందని తెలుస్తున్నది. గోవా సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో తన కుమారుడిని చంపి, బ్యాగులో వేసుకుని కర్ణాటక వెళుతూ ఆమె పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆమెను మొదట తనిఖీ చేసినప్పుడు మృతదేహాన్ని బ్యాగులో ఉంచి, దానిపై బొమ్మలు, దుస్తులు సర్దేసిందని సమాచారం. బ్యాగ్‌ మొత్తం చూపించాలని కోరినప్పుడు అందులో దుస్తులు, ఆట వస్తువుల కింద చిన్నారి మృతదేహం ఉండటంతో పోలీసులు నివ్వెరపోయారు. మృతదేహం గురించి పోలీసులు ప్రశ్నించగా.. అది తన కుమారుడిదని ఆమె ఒప్పుకొన్నది. అంతకు మించి ఆ మహిళ ఏమీ చెప్పలేదని పోలీసులు తెలిపారు. తన కుమారుడిని అరెస్టు చేసినందుకు బెంగళూరుకు చెందిన స్టార్ట్‌అప్‌ కంపెనీ సీఈవో సుచన సేథ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు గోవా పోలీసుల సమక్షంలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితురాలిని గోవాలోని కలాంగుటే పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


తన కుమారుడి శవంతో ఒక క్యాబ్‌లో పారిపోతుండగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు అమెను అడ్డుకున్నారు. ఈ హత్యోదంతం.. ఆమె బస చేసిన సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ సిబ్బంది గదిలో రక్తపు మరకలు చూసి అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆమె వెళ్లిపోయేటప్పుడు ఆమె కుమారుడు వెంట లేడని కూడా వారు తెలిపారు. దీనిపై పోలీసులు ఆమెను ప్రశ్నించగా మొదట అతడు గోవాలోని స్నేహితుల ఇంటి వద్దే ఉన్నాడని బుకాయించింది. కానీ.. కాసేపటికే అసలు విషయం బయటపడింది. ఈ ఉదంతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. ఆమెను ఆరు రోజుల పోలీస్‌ కస్టడీకి తరలించారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి, బుధవారం అంత్యక్రియలు జరిపించారు.